రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారు కానీ..

October 26, 2016


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం గురించి ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోని చెప్పిన సమాధానం విన్నట్లయితే రాహుల్ గాంధీపై జాలి కలుగక మానదు. డిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకి ఆమె సమాధానం ఇస్తూ, రాహుల్ గాంధీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని తెలుసు కానీ అది ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేము. ప్రస్తుతం ఆయన యుపి, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో  క్షణం తీరిక లేకుండా ఉన్నారు.  బహుశః వాటి తరువాతే ఈవిషయం గురించి ఆయన ఆలోచించవచ్చు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టదలిస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను,” అని అంబికా సోని చెప్పారు. 

రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న మాట వాస్తవమే కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టలేకపోవడానికి అది కారణం కాదని అందరికీ తెలుసు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందిన తరువాత ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టబోతే, పార్టీలో సీనియర్ నేతలు కొందరు అభ్యంతరం తెలిపారు. ఆయనకి పార్టీని నడిపించగల నాయకత్వ లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు. మళ్ళీ గత ఏడాది ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతే మళ్ళీ అదే పరిస్థితి ఎదురవడంతో ఆయన పార్టీపై అలిగి ‘పార్టీకి శలవు పెట్టి’ విదేశాలకి వెళ్ళిపోయారు. 

ఆయనని బుజ్జగించి విదేశాల నుంచి తిరిగి రప్పించినప్పటికీ ఇంతవరకు పార్టీ అధ్యక్షుడుగా నియమించక పోవడానికి కూడా అదే కారణం. నేటికీ పార్టీలో చాలా మంది ఆయన ఆ పదవి చేపట్టేందుకు అనర్హుడు అని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఒక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష పదవికి కూడా పనికిరాడని, అతనిని తక్షణమే ఆ పదవిలో నుంచి తొలగించాలని అన్నందుకు అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

నిజానికి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని పార్టీలో నేతలు అందరూ ముక్తకంఠంతో కోరుకోవాలి. ఆయన ఆ పదవి చేపడుతుంటే ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదు. కానీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. చివరికి అంబికా సోనీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ సామి వంటి సీనియర్ నేతలు ఆయనకి మద్దతు ఇస్తామని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. 

ఆ పదవి చేపట్టలేకపోవడానికి పార్టీలో నేతలే అభ్యంతరాలు చెపుతున్నారనే విషయం దాచిపెట్టి, ఆయన ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందునే దాని గురించి ఆలోచించలేకపోతున్నారని సర్దిచెప్పుకోవలసి వస్తోంది. ఒకవేళ ఇప్పుడు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తే, అప్పుడు పార్టీలో నేతలు మళ్ళీ అభ్యంతరాలు చెప్పినట్లయితే ఆయన మళ్ళీ అలిగి విదేశాలకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు భాజపాతో సహా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దానినే అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించవచ్చు. బహుశః ఆ భయంతోనే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమించే ఆలోచనలు చేయడం లేదని చెప్పవచ్చు. కనీసం ఆ ఎన్నికలు పూర్తయిన తరువాతైన కూడా ఆయనని అధ్యక్షుడుగా నియమించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. పార్టీలో ఏదో ఊహించని పరిణామం జరిగితేనే అది సాధ్యం అవుతుంది.


Related Post