మాకు ఆ పరిమితులు వద్దు: హరీష్ రావు

October 26, 2016


img

తెలంగాణా ధనికరాష్ట్రమని, ఆర్ధికంగా చాలా బలంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పుకొంటుంటారు. కానీ తమ ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకి కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయం కూడా సరిపోవడం లేదని, ఇంకా అదనపు సహాయం కావాలని కోరుతుంటారు. 

ప్రధాన మంత్రి కృషి సంచాయ్‌ యోజన పధకం క్రింద తెలంగాణాలో ఎంపిక చేసిన 11 సాగునీటి ప్రాజెక్టులకి నాబార్డు ద్వారా రూ. 1,500 కోట్లు రుణం విడుదలైంది. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి మరో రూ.7,000 కోట్లు అధనంగా రుణం కోరుతోంది కానీ ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం.పరిమితి కారణంగా అదనపు రుణం మంజూరు కావడం లేదు. కనుక దానితో సంబంధం లేకుండా తమకి అవసరమైనంత నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని మంత్రి హరీష్ రావు నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసినప్పుడు అభ్యర్ధించారు. దేవాదుల ప్రాజెక్టుకి కేంద్రం 25 శాతం ఆర్దికసాయం అందజేస్తోంది. దానిని 60 శాతానికి పెంచాలని కోరారు. మిషన్ కాకతీయకి నీతి ఆయోగ్ సూచించిన విధంగా రూ.5,000 కోట్లు గ్రాంట్ గా విడుదల చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. 

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడైనా తెలంగాణా పర్యటనకి వచ్చినప్పుడు, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఇటువంటి సహాయసహకారాల గురించి మాట్లాడితే, తెరాస మంత్రులు అందరూ ముక్తకంఠంతో దానిని గట్టిగా ఖండిస్తారు. కేంద్రప్రభుత్వం అసలు సహాయమే చేయడం లేదన్నట్లుగా వాదిస్తారు. కానీ ఒకపక్క ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటూనే ఇంకా ఇంకా అప్పులు కావాలని, వాటికి ఎటువంటి పరిమితులు విదించకూడదని కోరుతుంటారు. తాము ఏ కేంద్రప్రభుత్వాన్నయితే సహాయం చేయడం లేదని విమర్శిస్తుంటారో, మళ్ళీ అదే కేంద్రప్రభుత్వం నుంచి సహాయం అర్దిస్తుంటారు.

ఒకప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రప్రభుత్వం ఎన్నడూ ఇంత ఉదారంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రాలలో తమ ప్రత్యర్ధ పార్టీలు అధికారంలో ఉన్నపటికీ, మోడీ ప్రభుత్వం వాటిఅపట్ల ఎటువంటి భేదభావం చూపించకుండా చాలా ఉదారంగా సహాయసహకారాలు అందిస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి సహాయసహకారాల గురించి చెప్పుకోవడానికి రాష్ట్రాలు ఇష్టపడవు. అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేయడంలో రాష్ట్ర భాజపా నేతలు చాలా అశ్రద్ధ వహిస్తుండటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post