తండ్రి, కొడుకులతో అవి దోస్తీ చేస్తాయా?

October 25, 2016


img

యూపిలో సమాజ్ వాదీ పార్టీ లో తండ్రి కొడుకుల మద్య జరుగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ తన పార్టీ నేతలని, కొడుకు అఖిలేష్ ని ఉద్దేశ్యించి మాట్లాడుతున్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి పట్ల ఎంత భక్తిశ్రద్దలు చూపుతారో వివరించి, ఆవిషయంలో తన కొడుకు ఆయనతో సరితూగలేడన్నట్లుగా మాట్లాడారు. పార్టీ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న తన కొడుకు గురించి ఆయన ఆవిధంగా మాట్లాడి తన రాజకీయ ప్రత్యర్ధిని పొగడటంతో భాజపాకి చిన్న సానుకూల సంకేతం పంపినట్లు అయ్యింది. 

ఈరోజు మధ్యాహ్నం ములాయం సింగ్ లక్నోలో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా తన కొడుకుని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేదు. ఎన్నికల తరువాతే దానిపై నిర్ణయం తీసుకొంటామని చెప్పడంతో అక్కడే ఉన్న అఖిలేష్ వర్గం ఆయన సభలోనే రభస చేయడంతో తండ్రికొడుకులు ఇక కటీఫ్ చెప్పేసుకోవడానికి సిద్దం అయినట్లే భావించవచ్చు. 

అఖిలేష్ యాదవ్ ఎలాగూ కొత్తపార్టీ పెట్టుకోవడానికి సిద్దం అవుతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే ఆయన దానితో చేతులు కలుపవచ్చు. బహుశః అందుకే ఆయన చాలా రోజులుగా రాహుల్ గాంధీకి పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు. అదే జరిగితే తండ్రి భాజపాతో, కొడుకు కాంగ్రెస్ పార్టీతో  చేతులు కలిపి కత్తులు దూసుకోవచ్చు. కానీ వారి కీచులాటలు రచ్చకెక్కడంతో తండ్రికొడుకులిరువురిపై  రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనుక కాంగ్రెస్, భాజపాలు వారితో చేతులు కలపడానికి అంగీకరించకపోవచ్చు. అందుకు వాటికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి.  

కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ని తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఉంది కనుక ఒకవేళ అఖిలేష్ యాదవ్ తో చేతులు కలపాలనుకొంటే ఆమెని పక్కన పెట్టవలసి ఉంటుంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఈ ఎన్నికలలో భాజపా స్వంత మెజార్టీతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు సూచిస్తున్నాయి కనుక అది ములాయంతో చేతులు కలిపేందుకు సిద్దపడకపోవచ్చు. కనుక ఒకవేళ తండ్రి కొడుకులు వేరుపడినట్లయితే, వారు పూర్తిగా బలహీనపడతారు కనుక భాజపా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి. కాంగ్రెస్, భాజపాలు రెండూ సమాజ్ వాదీ పార్టీ లో జరుగుతున్న ఈ గోదావాలని నిశితంగా గమనిస్తున్నాయి తప్ప ఎటువంటి సానుకూల ప్రకటనలు చేయకపోవడం గమనిస్తే అవి వారితో చేతులు కలిపేందుకు సిద్దంగా లేవని భావించవచ్చు.   



Related Post