బంగారి తెలంగాణా కోసమే కలలు కంటారు..కానీ..

October 25, 2016


img

బంగారి తెలంగాణా కోసమే పార్టీ ఫిరాయింపులు అదే...’రాజకీయశక్తుల పునరేకీకరణ’ అని చెప్పుకొంటున్న కెసిఆర్, ఆ పేరుతో ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప, బంగారి తెలంగాణా కోసం ఏమి చేయాలో, ఆ ప్రయత్నంలో ఎక్కడెక్కడ లోపాలు లేదా తప్పులు జరుగుతున్నాయో ప్రతిపక్షాలు చెపుతున్నప్పుడు వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నాలు చేయడం లేదని చెప్పకతప్పదు. పైగా తన వాగ్ధాటితో వాటి విమర్శలని, ఆరోపణలని బలంగా త్రిప్పికొడుతూ వాటిపై విజయం సాధించినట్లు గర్వపడుతున్నారు. 

కానీ మళ్ళీ ఆయనే ప్రతిపక్షాలని నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని కోరుతుంటారు. మరిప్పుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రతిపక్షాలు ఇస్తున్నవి నిర్మాణాత్మకమైన సలహాలు కావా?మరి వాటిని తెరాస సర్కార్ ఎందుకు హుందాగా స్వీకరించలేకపోతోంది? 

కెసిఆర్ పట్ల భయం వల్లనయితేనేమి వేరే మరో కారణం వల్లనయితేనేమి అధికార పార్టీ సభ్యులు గ్రామ, జిల్లా స్థాయిలలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలని ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు జంకుతున్నారు. ఆ కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు పేరుకొని పోతున్నాయి. వాటినే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తుంటే వాటిని తెరాస సర్కార్ సానుకూల దృక్పధంతో స్వీకరించలేకపోతోంది. సమస్యలు పెరుగుతున్న కొద్దీ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతుందని వేరే చెప్పనక్కరలేదు. అధికార పార్టీ సభ్యులు చేయలేని పనిని ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు వారిని తమ రాజకీయ ప్రత్యర్ధులుగా కాకుండా మంచి సలహాలు చెపుతున్న స్నేహితులుగా చూస్తూ, వారు చెపుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లయితే వారి కంటే తెరాసయే ఎక్కువ ప్రయోజనం పొందుతుంది కదా? 

కానీ మూస రాజకీయాలకి అలవాటు పడిపోయిన కారణంగా ప్రతిపక్షాలు ఏమి చెప్పినా వాటిని తప్పుగా నిరూపించి వాటిపై ఎదురుదాడి చేయాలని అధికార పార్టీ భావిస్తుంటే, ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా దానిని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉండాలనే నిశ్చితాభిప్రాయం ప్రతిపక్షాలది. అందరూ బంగారి తెలంగాణా ఏర్పరచుకోవాలనే కోరుకొంటున్నారు కానీ దాని కోసం చేతులు కలపడానికి ఇష్టపడరు. 


Related Post