తమ్మినేని కల నెరవేరుతుందా?

October 25, 2016


img

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర నిన్న ఇబ్రహీం పట్టణంలో కొంగర కలాన్ గ్రామం చేరుకొంది. ఆ సందర్భంగా నిర్వహించిన సభకి మాజీ హోంమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యి ఆయనకి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలని అణచివేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ దొరలపాలన సాగిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. తెరాస సర్కార్ గ్రామాలని పట్టించుకోకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఎప్పుడూ హైదరాబాద్ కి తన ఫాం హౌస్ కే పరిమితం అవుతారు తప్ప గ్రామాలలో పరిస్థితులని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ్మినేని చూసిన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచి చర్యే. కానీ దానికి తెరాస సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో తేలికగానే ఊహించవచ్చు. తమ ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేస్తుంటే, తమ్మినేని పనిగట్టుకొని పాదయాత్రలు చేస్తూ ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడి చేయవచ్చు. ఆయన ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తున్నారు కనుకనే సబితా ఇంద్రారెడ్డి కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపారని చెప్పవచ్చు. 

నిజానికి తమ్మినేని కేవలం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్రలు చేయడం లేదని చెప్పక తప్పదు. రాష్ట్రంలో తెరాసకి ప్రత్యామ్నాయంగా సిపిఎంని మలచాలనే ఉద్దేశ్యంతోనే చేస్తున్నట్లు మొదటే చెప్పుకొన్నారు. కాంగ్రెస్, తెదేపా, భాజపాలు రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతని భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయనే నమ్మకంతోనే ఆయన ఇంత కష్టపడుతున్నారు. కానీ ఆయన ఊహిస్తున్నట్లుగా ఒకవేళ ప్రజలు తెరాస సర్కార్ పాలన పట్ల విముఖత ఏర్పరచుకొంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో, లేదా కేంద్రంలో అధికారంలోకి వచ్చే భాజపాకో అధికారం కట్టబెడతారు తప్ప సిపిఎంకి కట్టబెట్టకపోవచ్చు. కనుక తెరాసకి ప్రత్యామ్నాయంగా సిపిఎం ఎదగాలనే ఆయన కల ఫలిస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి. 

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు, పరిపాలన ప్రజలకి సుపరిచితమే కనుక దానికి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అవకాశం ఇవ్వవచ్చు. కనుక కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు ఎవరైనా వారితో నిసంకోచంగా చేతులు కలుపుతుంది. కనుకనే సబితా రెడ్డి ఆయనకి సంఘీభావం తెలిపారనుకోవలసి ఉంటుంది.


Related Post