అది ఉత్తమ నిర్ణయం...కాదేమో?

October 24, 2016


img

తెలంగాణా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు చూసిన వారందరూ చాలా షాక్ అవుతున్నారు. కారణం ఎప్పుడూ నీటుగా గెడ్డం గీసుకొని నిగనిగలాడుతున్న బట్టతలతో కనబడే అయన ఇప్పుడు సాధువులాగా బారెడు గెడ్డం పెంచేయడమే. ఆయనేదో దేవుడికి మొక్కుకొంటే పరువాలేదు కానీ చాలా అసాధ్యమైన పని కోసం గెడ్డం పెంచడం మొదలుపెట్టడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెరాసని ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే వరకు గెడ్డం గీసుకోనని ప్రతిజ్ఞ చేశారుట! 

అయన కోరుకొన్నట్లుగా తెరాసని ఓడించాలన్నా కూడా ముందు ఎన్నికలు జరగాలి కదా! వాటికి ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉంది. ఆలోగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెడ్డం ఇంకెంత పెరిగిపోతుందో, దానిని ఆయన ఎలాగ భరించాలనుకొంటున్నారో తెలియదు కానీ ఈవిషయంలో ఆయన తొందరపడ్డారనిపిస్తోంది. బట్టతల కారణంగా ఆయన నెత్తిమీద జుట్టు పెరుగకపోయినా, చాలా ఆరోగ్యంగా ఉంటారు కనుక గెడ్డం మాత్రం శరవేగంగా పెరిగిపోతోంది. కానీ ఎన్నికలు మాత్రం అవి రావలసిన సమయంలోనే అంటే 2019లోనే వస్తాయి. 

అప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం లేదు. ఈ రెండున్నరేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఏవిధంగా బారీ మెజార్టీతో విజయం సాధించిందో చూస్తే, పోల్ మేనేజ్మెంట్ లో కెసిఆర్ కి మించినవాడు లేడని స్పష్టం అవుతోంది. గ్రేటర్ ఎన్నికలలో బోర్లాపడిన ప్రతిపక్షాలు, “దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు జరిపించండి మా తడాఖా చూపిస్తాము” అంటూ కెసిఆర్ కి సవాళ్ళు విసురుతున్నాయి. కానీ కెసిఆర్ కి ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో కూడా బాగా తెలుసు కనుక వాటి సవాళ్ళని పట్టించుకోవడం లేదు. 

అయినా తమ పార్టీకి ఏమాత్రం బలం, పట్టులేని గ్రేటర్ ఎన్నికలలో ఘనవిజయం సాధించేందుకే ఏడాది పాటు కసరత్తు చేసిన కెసిఆర్, తమ పార్టీ భవిష్యత్ కి సవాలు వంటి వచ్చే సార్వత్రిక ఎన్నికలని ఎదుర్కోవడం కోసం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొంటారని అనుకోలేము. ఒకవేళ ఆ ఎన్నికలలో ఓడిపోతే తన రాజకీయ వారసుడైన కెటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు దూరం అయిపోతాయి కనుక ఎట్టి పరిస్థితులలో కూడా వచ్చే ఎన్నికలలో తెరాస విజయం సాధించేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా గత ప్రభుత్వాలతో పోలిస్తే తెరాస సర్కార్ హయంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి బాగానే ఉంది. మిగిలిన రెండున్నరేళ్ళలో మరింత అభివృద్ధి పనులు చేసి ప్రజలని మెప్పించే అవకాశం కూడా ఉంది. 

రాజకీయాలలో ఉన్నవాళ్ళు తమ బలాన్ని అతిగా ఊహించుకోవడం, ప్రత్యర్ధి బలాన్ని తక్కువగా అంచనా వేయడం  సాధారణ విషయమే. కానీ అపార రాజకీయ అనుభవజ్ఞుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెరాస సర్కార్ నానాటికీ రాష్ట్రంలో బలపడుతోందనే సంగతి తెలియదనుకోలేము. తెలిసీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేవరకు గెడ్డం గీసుకోనని ప్రతిజ్ఞ చేయడం అంత మంచి నిర్ణయం కాదేమో? దానికంటే, పెద్దగా ఇబ్బంది కలిగించని...ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కన పెట్టేయగల ‘రాజకీయ సన్యాసం చేస్తాననో’ లేదా ‘అసెంబ్లీలో అడుగుపెట్టననో’ లేదా ‘ఫలాన కూల్ డ్రింక్ త్రాగననో’ శపథం చేసి ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా? 

ఒకవేళ ఆయన కష్టపడి వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా అధికారంలోకి తీసుకురాగలిగినా, ఆయన ఇన్నాళ్ళుగా పెంచిన గెడ్డాన్ని గీసుకోనేలోగానే ఏ కోమటిరెడ్డో, జానారెడ్డో మరొకరో డిల్లీ వెళ్ళి మాడంగారిని ప్రసన్నం చేసుకొని సిఎం కుర్చీలో సెటిల్ అయిపోయే అవకాశాలే ఎక్కువ. కనుక ఏవిధంగా చూసినా కూడా గెడ్డం పెంచడం అంత ఉత్తమ నిర్ణయం కాదనిపిస్తోంది. 


Related Post