ఆగిపోయిన పెళ్ళికి జగన్ బాజాలు?

October 22, 2016


img

ఏపికి ప్రత్యేకహోదా అనేది ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. దానితో ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మళ్ళీ దానితోనే ప్రజలని ఆకర్షించి తమ పార్టీలని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. 

చంద్రబాబుతో సహా అందరూ కూడా గత రెండున్నరేళ్ళుగా దానిపై రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతుండటంతో, దాని గురించి వారిని నిలదీసేందుకు ప్రతిపక్షాలకి వీలు కలిగింది. ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుతో సహా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ప్రజలకి భయపడి వారు కూడా దాని గురించి కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నట్లు నటించేవారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో దాని కోసం తెదేపా ఎంపిలు చేసిన హడావుడి కూడా అటువంటిదే. 

అంతవరకు హోదా కావాలని అడుగుతున్న చంద్రబాబు అండ్ కో, అకస్మాత్తుగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజికి ఓకే చెప్పేయడం యాదృచ్చికంగా జరిగిందేమీ కాదని చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటామని ఇద్దరు నాయుళ్ళు చెప్పేవారు. బహుశః దానర్ధం ఇదే అయ్యుండవచ్చు. రెండునరేళ్ళు దానిపై డ్రామాలు ఆడిన తరువాత తెదేపా ఒత్తిళ్ళకి తలొగ్గి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినట్లు కేంద్రం నటిస్తే, ఇక విధిలేని పరిస్థితులలోనే దానిని పుచ్చుకొన్నట్లు చంద్రబాబు మరో గొప్ప డ్రామా ఆడారు.  

 దానిని తీసుకోవడం కోసం బాకా మీడియాతో అనుకూలవాతావరణం సృష్టించుకొని, చివరి నిమిషం వరకు దానిపై కూడా బాకా మీడియా సహాయంతో చాలా హైడ్రామా నడిపిస్తూ దానిని రక్తి కట్టించి అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజి పుచ్చేసుకొన్నారు. ఈ విధంగా ప్రతిపక్షాలు, తెదేపా, భాజపాలు అన్నీ కలిసి ఏపి ప్రజలతో గేమ్స్ ఆదేసుకోన్నాయి. 

అది పుచ్చేసుకొన్న తరువాత ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజియే చాలా గొప్ప అని తెదేపా-భాజపాలు రెండూ కలిసి కోరస్ పాడటం మొదలుపెట్టాయి. వాటికి బాకా మీడియాలు కూడా యధాశక్తిగా కోరస్ పాడేసి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే దానిని ప్రజలు కూడా అంగీకరించేసినట్లు తీర్మానించేసాయి. ఇప్పుడు తెదేపా నేతలు ఎవరూ హోదా గురించి మాట్లాడటం లేదు. ప్యాకేజిల గురించే మాట్లాడుతున్నారు. కనుక తెదేపా-భాజపా, బాకా మీడియా మూడూ కలిసి ఆ ప్రత్యేక ఫైలుని క్లోజ్ చేసేసినట్లే భావించవచ్చు.  

కానీ ఆగిపోయిన పెళ్ళికి బాజాలు వాయిస్తున్నట్లుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేక హోదా అని ఇంకా కలవరిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రత్యేక హోదా సెంటిమెంటు చచ్చిపోకుండా కాపాడుతానని, వచ్చే ఎన్నికలలో దానినే ప్రధాన అస్త్రంగా తెదేపాపై ప్రయోగిస్తానని మనసులో మాట దాచుకోకుండా బయటకి చెప్పేశారు కనుక అప్పుడప్పుడు యువభేరి పేరిట కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అక్టోబర్ 25న కర్నూలులో యువభేరి మోగించబోతున్నారు. 

విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి వారు కూడా ఏమీ చేయలేరు కనుక ఎన్నికల వరకు వారి డ్రామాలన్నీ ఓపికగా చూడక తప్పడం లేదు.                  



Related Post