అంతమంది నయీంతో చేతులు కలిపారా?

October 19, 2016


img

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగిన తరువాత కొంతమంది రాజకీయ నేతలు, పోలీస్ అధికారులకి అతనితో సంబంధాలు కలిగి ఉండేవారని వార్తలు బయటకి పొక్కినప్పుడు అది చాలా చాలా సంచలనం సృష్టించింది. వారిలో కొద్దిమంది మాత్రం మీడియా ముందుకి వచ్చి తమకి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని ఖండన ప్రకటనలు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ సిట్ అధికారుల దర్యాప్తులో డజన్ల కొద్దీ రాజకీయ నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు ఇప్పుడు బయటపడ్డాయి. 

వారిలో తెలంగాణా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, తెరాస నేత చింతల వెంకటేశ్వర రెడ్డి, డి.ఎస్.పి. సాయి మనోహర్, ఎస్.పి.మద్దిపాటి శ్రీనివాస్, సి.ఐ.మస్తాన్ వలీ, ఎస్.ఐ.బూర రాజగోపాల్, పోలీస్ అధికారి మలినేని శ్రీనివాస్ రావుల పేర్లు వారి బినామీల పేర్లు వెల్లడయ్యాయి. వారి బినామీల పేర్లతో నయీం ఎక్కడెక్కడ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో ఆ వివరాలు కూడా బయటపడ్డాయి. 

ఈవిధంగా ప్రభుత్వాన్ని నడిపే రాజకీయనేతలు, చట్టాన్ని, ప్రజలని కాపాడవలసిన పోలీసులు  గూండాలతో చేతులు కలిపితే ఇక సామాన్య ప్రజలు ఎవరికి మోర పెట్టుకోవాలి? అనే సందేహం కలుగుతుంది. తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు కావస్తోంది. తమ ప్రభుత్వం చాలా నిజాయితీగా, ప్రజారంజకంగా చాలా పారదర్శకంగా పనిచేస్తోందని వారు గొప్పలు చెప్పుకొని రోజు లేదు. కానీ నయీం ఎన్కౌంటర్ జరిగేవరకు కూడా తమ పార్టీలో నేతలు, తమ ప్రభుత్వంలో పోలీస్ అధికారులే అతనితో చేతులు కలిపి అక్రమాస్తులు కూడబెట్టుకొంటున్న సంగతి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలియదా? ప్రతిపక్షాలు చిన్న విమర్శ చేస్తే వారిపై మూకుమ్మడిగా ప్రతివిమర్శలు చేసే తెరాస సర్కార్ లో మంత్రులు, పార్టీ నేతలు నయీం ఎన్కౌంటర్ జరిగిన తరువాత ఇంతవరకు ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదు? అనే ప్రశ్నకి జవాబు లేదు. శోచనీయమైన విషయం ఏమిటంటే, ఎక్కడైనా చీమ చిటుక్కుమంటే పసిగాట్టేసి అక్కడ వాలిపోయి చాలా హడావుడి చేసే దమ్మున్న చానల్స్ కూడా నయీం చేసిన ఈ అరాచకాలు, ఆకృత్యాల గురించి అతను బ్రతికి ఉన్నంత కాలం మాట్లాడే సాహసం చేయలేకపోయాయి. ఇప్పుడు అన్ని చానల్స్ పోటీ పడి నయీం ఆకృత్యాల గురించి తెగ వర్ణిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా అవి మేల్కొన్నందుకు సంతోషించాలి.  



Related Post