ఆ ప్రత్యేక హోదా ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తారో?

October 18, 2016


img

ప్రత్యేక హోదా అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తే తప్పు కాదు. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని ఎంతగా బ్రతిమాలుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కానీ భారత్ పై నిత్యం ఉగ్రదాడులు చేయిస్తూ, సరిహద్దులలో కాల్పులు జరుపుతూ, కాశ్మీర్ లో చిచ్చుపెడుతున్న పాకిస్తాన్ కి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాని వెనక్కి తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత, దానికిచ్చిన ఆ ప్రత్యేక హోదాని రద్దు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. కానీ దానిపై తరువాత నిర్ణయం తీసుకొందామని చెప్పి సమావేశాన్ని ముగించారు. ఇంతవరకు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన నేటికీ భారత్ దృష్టిలో పాకిస్తాన్ “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” గానే ఉంది. 

పాకిస్తాన్ కి ఆ ప్రత్యేక హోదాని నేటికీ కొనసాగిస్తూ, ఐక్యరాజ్యసమితిలో, బ్రిక్స్ సమావేశాలలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలని కోరడం చాలా విడ్డూరంగా ఉంది. దౌత్యపరంగా చూసినట్లయితే ఇది పెద్ద పొరపాటుగానే చెప్పవచ్చు. ప్రపంచదేశాలన్నీ పాకిస్తాన్ని దూరంగా పెట్టాలని, దానిపై ఆంక్షలు విదించాలని భారత్ కోరుతున్నప్పుడు, ముందుగా భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆ ప్రత్యేక హోదాని మొదట ఉపసంహరించుకొని ఉండాలి. కానీ పాకిస్తాన్ని చంకనెట్టుకొని తిరుగుతూ దానిని ఏకాకీ చేయాలని ప్రపంచదేశాలని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

ఒకవేళ పాకిస్తాన్ కి ఇచ్చిన ఆ ప్రత్యేక హోదాని రద్దు చేయడం వలన భారత్ వాణిజ్య సంస్థలు బారీగా నష్టపోతాయనే భయంతోనే వెనుకాడుతున్నట్లయితే, రేపు ఏదో ఒకరోజు ఏదో ఒక దేశమో లేకపోతే దేశంలోనే ప్రతిపక్షాలో ఈ ప్రశ్న తప్పకుండా అడగవచ్చు. అప్పుడు వాటికి జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడేది మోడీ ప్రభుత్వమే. ఇంత జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ కి ఈ ప్రత్యేక హోదా కొనసాగిస్తుండటం వలన ప్రజలకి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అవుతోంది కూడా. పాకిస్తాన్ పట్ల మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఆగ్రహావేశాలు నిజమైనవేనా లేక ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ప్రదర్శిస్తున్నవా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ పాకిస్తాన్ కి ఇచ్చిన ఆ ప్రత్యేక హోదాని రద్దు చేయడం సాధ్యం కాకపోతే అందుకు కారణాలు కేంద్రప్రభుత్వమే ప్రజలకి తెలియజేస్తే ఇటువంటి అనుమానాలు, అపోహలు తలెత్తకుండా నివారించవచ్చు. 


Related Post