ఆలోచించవలసింది రోహిత్ కులం గురించి కాదు

October 18, 2016


img

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొని 10 నెలలు అయ్యింది. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది? అందుకు ఎవరు బాధ్యులు? ఈ సమస్యకి పరిష్కారాలు ఏమిటి? అని ఆలోచించకుండా అతను దళితుడా కాదా? అనే అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతుండటం చాలా విచారం, విస్మయం కలిగిస్తోంది. అతను వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకొన్నట్లు ప్రాధమికంగా రుజువయింది కానీ ఇంతవరకు దోషులకి శిక్ష పడలేదు. దోషులెవరో తెలిసినా అందరూ తెలియనట్లు నటిస్తున్నారు. రోహిత్ చనిపోగానే రాబందులు వాలినట్లుగా దేశంలో ఎక్కడెక్కడి నుంచో రాజకీయ నాయకులు వచ్చి యూనివర్సిటీలో వాలిపోయారు. మొసలి కన్నీళ్ళు కార్చి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ ఒక్కరూ యూనివర్సిటీ వైపు చూసింది లేదు. 

రోహిత్ ఖచ్చితంగా దళితుడే అనే నమ్మకంతోనే వారందరూ శవరాజకీయాలు చేయడానికి వచ్చారు తప్ప అతనిపై ప్రేమతో కాదని తెలుసు. రాజకీయ నాయకులు అంతకంటే ఎక్కువ దూరం చూడలేరని అందరికీ తెలుసు. సమాజంలో ఒకదాని తరువాత మరొకటి ఏవో కొన్ని సంఘటనలు, రాజకీయ పరిణామాలు వరుసగా జరుగుతూనే ఉంటాయి కనుక రోహిత్ కేసుపై రాజకీయ నాయకులు, ప్రజలు ఆసక్తికోల్పోవడం సహజమే. కానీ ఇంతగా సంచలనం సృష్టించిన ఆ కేసుని మన న్యాయవ్యవస్థలు కూడా పట్టించుకోకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రోహిత్ కి ఇంతవరకు న్యాయం చేయలేకపోయినా, రోహిత్ కేసుని ఆటకెక్కించేసినా, అతని కులం గురించి చర్చించడం మాత్రం మరిచిపోకపోవడం గమనిస్తే సమాజం కూడా ఎంత సంకుచితంగా ఆలోచిస్తోందో అర్ధం అవుతుంది. రోహిత్ దళితుడు కాడని మనవ హక్కుల సంఘం, పోలీసులు వాదిస్తుంటే, కాదు తను దళితుడేనని స్వయంగా చెప్పుకొన్నాడని విద్యార్ధులు వాదిస్తున్నారు.  

ఇప్పుడు ఆలోచించవలసిన విషయం రోహిత్ దళితుడా కాదా అని కాదు. అతనికి న్యాయం జరిగిందా లేదా అని! యూనివర్సిటీలో నెలకొన్న ఆ కుల,మత, జాతి వివక్షని తొలగించడానికి చిన్న ప్రయత్నమైన మనం చేస్తున్నమా లేదా అని! యూనివర్సిటీలలో ఆ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పటికీ విద్యార్ధులు ఈ కులం, మతం, జాతి, ప్రాంతం, బాష, యాస అనే సంకుచిత భావాలని వదిలించుకోలేకపోతున్నందుకు బాధ కలుగుతుంది. వారికి విద్య నేర్పవలసిన గురువులు కూడా ఈ సంకుచిత భావాలకి అతీతంగా ఆలోచించలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. ఇంత సంకుచిత భావాలున్న విద్యార్ధులు, గురువులు తమని తామే ఉద్దరించుకోలేనప్పుడు ఇంకా దేశాన్ని ఏమి ఉద్దరించగలరు? అని అందరూ ఆలోచించాలి.



Related Post