ఆ రెండు వ్యూహాలు భాజపాని గెలిపిస్తాయా?

October 18, 2016


img

యుపి శాసనసభ ఎన్నికలకి ఇంకా 5-6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతీయ రాజకీయాలని శాశిస్తున్న యుపిలో విజయం సాధించడం కోసం భాజపా రెండు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1. ప్రధాని నరేంద్ర మోడీ పేరుతోనే ఎన్నికలని ఎదుర్కోవడం. 2. అయోధ్యలో రామాయణ మ్యూజియం నిర్మాణం పేరిట ప్రజలలో భావోద్వేగాలని రెచ్చగొట్టడం. 

వాటిలో మొదటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కనుక ప్రతిపక్షాలు భాజపాని తప్పు పట్టలేవు. కానీ మిగిలిన అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధులని ముందే ప్రకటించుకొని ఎన్నికలకి వెళుతుంటే, భాజపా ప్రకటించకపోవడంపై ఎద్దేవా చేయవచ్చు. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి చేపట్టగల సమర్ధుడు లేడని లేదా ఆ పదవి కోసం పార్టీలో కుమ్ములాతలు సాగుతున్నాయని, అందుకే భాజపా తన ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరుని ప్రకటించలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చు. 

కానీ ప్రతిపక్ష ముఖ్యమంత్రి అభ్యర్ధులు అఖిలేష్ యాదవ్, మాయావతి, షీలా దీక్షిత్ ముగ్గురూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు కావడం, వారితో పోలిస్తే మోడీ పాలన చాలా అద్భుతంగా కనిపిస్తుంది కనుక మోడీ నామస్మరణతోనే వారు ముగ్గురికీ చెక్ పెట్టాలని భాజపా నిర్ణయించింది. 

భాజపా తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించినట్లయితే వారి ముగ్గురి కంటే బలమైన, మంచిపేరున్న వ్యక్తిని నిలబెట్టవలసి ఉంటుంది. రాష్ట్ర భాజపాలో అటువంటి వ్యక్తి ఎవరూ లేరనే చెప్పవచ్చు. కనుక వారి ముగ్గురికంటే అన్నివిధాల మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ భజనతోనే వారిని నిలువరించాలని భాజపా నిర్ణయించింది. పైగా ఇటీవల సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన తరువాత యూపిలో మోడీ పాపులారిటీ చాల విపరీతంగా పెరిగిపోయింది కనుక ఇది చాలా మంచి వ్యూహమేనని చెప్పవచ్చు. 

ఇక అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరు చెప్పుకొని భాజపా చాలాసార్లు ఓట్లు దండుకొంది. కానీ ఇప్పుడు ఆ ఐడియా పనిచేయడం లేదు. కనుక అయోధ్యలో బాబ్రీ మశీదుకి 15 కిమీ దూరంలో రామాయణ మ్యూజియాన్ని నిర్మించడానికి హడావుడి మొదలుపెట్టింది. సహజంగానే ప్రతిపక్షాలు అందుకు భాజపాపై విమర్శలు గుప్పిస్తాయి. భాజపాకి కూడా అదే కావాలి కనుక ఎన్నికల వరకు ఈ అంశంపై ప్రతిపక్షాలతో వాదోపవాదాలు చేస్తూ దానిపై మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగేలా చేసి తద్వారా ప్రజలని కూడా దానిలో మమేకం చేయాలనేది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది. 

ఒకవేళ ప్రతిపక్షాలు దానిపై రాద్దాంతం చేసినట్లయితే వారిపై ప్రజలు ఆగ్రహించి భాజపాకే ఓట్లు వేస్తారు. ప్రతిపక్షాలు కూడా ఈ సంగతి గ్రహించాయి కానీ భాజపాని విమర్శించకుండా ఉండలేకపోతున్నాయి. అది ఎన్నికలలో హిందూ ఓటర్లని ఆకర్షించేందుకే అకస్మాత్తుగా ఈ పనికి పూనుకొంటోందని ఆరోపిస్తున్నాయి. అది నిజమే అయినా వారి విమర్శల వలన భాజపాకి లాభమే తప్ప ఎటువంటి నష్టమూ ఉండదు. కనుక ప్రతిపక్షాలు తనని ఎంతగా విమర్శిస్తే అంత మంచిదని భాజపా భావించవచ్చు. ఈ ఎత్తుగడ వలన రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు భాజపాకి దూరం కావచ్చు కానీ హిందూ ఓటర్లతో పోలిస్తే వారి సంఖ్య తక్కువే ఉంది కనుక భాజపా ఈ వ్యూహం అమలుచేయడానికి సిద్దపడినట్లు భావించవచ్చు.


Related Post