తెరాస సర్కార్ కి అది హెచ్చరికవంటిదేనా?

October 17, 2016


img

ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడటంలో ఎప్పుడూ ముందుండే వామపక్షాలు దేశంలో రెండు మూడు రాష్ట్రాలలో తప్ప ఎక్కడా అధికారంలో రాలేకపోతున్నాయి. కర్ణుడు చావుకి వంద శాపాలు..వంద కారణాలు అన్నట్లుగా వామపక్షాలు అధికారంలోకి రాలేకపోవడానికి కూడా అన్ని కారణాలే ఉన్నాయి. అవేమిటో వాటికీ తెలుసు. బహుశః అందుకేనేమో అధికారంలోకి రాలేకపోయినందుకు అవి ఎన్నడూ కించిత్ బాధ పడినట్లు కనబడవు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో తెరాసకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని సిపిఎం ఆలోచించడం, దాని కోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏకంగా 5 నెలలు రాష్ట్రమంతటా పాదయాత్ర చేయడానికి సిద్దపడటం చాలా ఆలోచించవలసిన విషయమే. 

ఇటువంటి పాదయాత్రలు కాంగ్రెస్, తెదేపా లేదా భాజపాలు చేసి ఉండి ఉంటే అది చాలా సర్వసాధారణమైన విషయంగానే ఉండేది. కానీ దీనిని సిపిఎం పార్టీ చేపడుతున్నందునే మరింత లోతుగా ఆలోచించవలసి ఉంటుంది.

ఎందుకంటే ఎన్నడూ అధికారం కోసం ఆరాటపడని, గట్టిగా పోరాడని సిపిఎం పార్టీకి కూడా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నట్లు గుర్తించి దానిని సద్వినియోగపరుచుకొని అధికారంలోకి రావాలనుకోవడం సాధారణమైన విషయమేమీ కాదని చెప్పవచ్చు. కానీ అది ఆశపడినంత మాత్రాన్న అధికారంలోకి రాలేకపోవచ్చునేమో కానీ ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో మరింత బలపడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం తెరాస సర్కార్ రాష్ట్రంలో చాలా బలంగానే ఉంది. చాలా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతోంది. ప్రతీ ఎన్నికలలో అదే బారీ మెజార్టీతో విజయాలు సాధిస్తోంది. కానీ అందరికీ తెలిసిన కొన్ని కారణాల చేత దానిపట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత కూడా నెలకొని ఉంది. ఏ ప్రభుత్వానికైనా అది సహజమే. కనుక తెరాస సర్కార్ కూడా దానిని లైట్ గానే తీసుకొంటున్నట్లుంది. 

గమ్మతైన విషయం ఏమిటంటే ప్రజలలో ఆ వ్యతిరేకతని సృష్టించిన తెదేపా, కాంగ్రెస్, భాజపాలు మూడు పార్టీలు కూడా దానిని తమ పార్టీలకి అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోవడం! తెరాస ప్రయోగించిన ఆకర్ష మంత్రంతో చాలా బలహీనపడిన కాంగ్రెస్, తెదేపాలు ప్రస్తుతం నాయకత్వ సమస్యలతో సతమతమవుతున్నాయి. కనుక ఆ రెండు పార్టీలు ఎంతసేపు ప్రభుత్వంపై పోరాటాలు చేయడానికే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రజల వద్దకి వెళ్ళి వారిని తమవైపు ఆకర్షించుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. తెరాసతో ఎటువంటి వైఖరి అవలంబించాలో తెలియక భాజపా అయోమయంలో ఉంది. 

కనుక ప్రజల వద్దకు వెళ్ళి వారిని తమవైప్పు తిప్పుకోవడానికి ఇదే మంచి సమయమని సిపిఎం భావిస్తున్నందునే ఈ యాత్ర పెట్టుకొందేమో? ఏది ఏమైనప్పటికీ, ఎన్నడూ అధికారం గురించి ఆలోచన చేయని సిపిఎం కూడా దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తోందంటే తెరాస సర్కార్ అప్రమత్తం అవడం చాలా అవసరమనిపిస్తోంది. 


Related Post