పవన్ కళ్యాణ్ కి అంత సీన్ లేదా?

October 17, 2016


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్, బహిరంగ సభలు పెట్టి ఏదో హడావుడి చేయడమే తప్ప ఏపిలో నెలకొన్న రాజకీయ శూన్యతని, చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని వినియోగించుకోలేకపోతున్నారనే చెప్పవచ్చు. రాజధాని నిర్మాణం కోసం పంట భూములని తీసుకొన్నప్పుడే పవన్ కళ్యాణ్ గట్టిగా ఉద్యమించి ఉండాల్సింది కానీ తుళ్ళూరు వెళ్ళి ఒకరోజు హడావుడి చేసి సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత ప్రత్యేక హోదా గురించి కూడా అలాగే వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు భీమవరంలో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. 

టిడిపి సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల స్థాపన పేరిట వేలాది ఎకరాల పంట భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకొంటుంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. కానీ ఆయనపై ఉన్న అవినీతిముద్రని హైలైట్ చేసి చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అతని నోరు మూయిస్తూ, తన తప్పులని కప్పి పుచ్చుకోవడమే కాకుండా రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ నిరాటంకంగా భూసేకరణ చేస్తోంది. 

తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా భాజపా గట్టిగా వ్యతిరేకించడం లేదు. రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాధారణ కోల్పోయింది కనుక దానినీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కనుక ఏపిలో రాజకీయ శూన్యత ఏర్పడి ఉంది. రాష్ట్ర ప్రజలలో, ముఖ్యంగా రైతులలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ యదాప్రకారం తన రైతు వ్యతిరేకతని ప్రదర్శించుకొంటూ రైతులని పట్టి పీడిస్తుంటే తమని ఆదుకొనే వారి కోసం రైతులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలో రావడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. కానీ ఆయన సినిమాలో చూపే ధైర్యం నిజజీవితంలో చూపలేక తడబడుతున్నారు. భీమవరంలో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి తమ ఘోడు మోరపెట్టుకొన్నప్పటికీ, ఆయన గట్టిగా స్పందించలేకపోయారు.

ఇదివరకు ప్రత్యేక హోదా కోసం మోడీ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని చెప్పినట్లే, ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇచ్చి చూద్దామని పవన్ కళ్యాణ్ చెప్పడం చూస్తే అయనకి చంద్రబాబుని ఎదుర్కొనే ఉద్దేశ్యం, ధైర్యం రెండూ లేవని స్పష్టం అవుతోంది. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వచ్చి మోర పెట్టుకొంటున్నా ధైర్యం చేయలేకపోతున్నప్పుడు ఇంకెప్పుడు చేస్తారు? పవన్ కళ్యాణ్ అంత ధైర్యం  లేదని చంద్రబాబు గ్రహించబట్టే ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యం వెదజల్లకుండా జాగ్రత్తలు తీసుకోని అక్కడే నిర్మిస్తామని వెంటనే ప్రకటించగలిగారు. పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తెదేపా, భాజపాలని ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు ఇంక రాజకీయాలు మాట్లాడటం మానేసి హాయిగా సినిమాలు చేసుకొంటే బాగుంటుంది కదా? అప్పుడు ఎవరూ ఆయనవైపు చూడరు..వేలెత్తి చూపరు కూడా.


Related Post