ఆ విషయంలో ఇద్దరు చంద్రులదీ ఒకే తీరు

October 17, 2016


img

ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రుల పనితీరులో చాలా తేడా ఉన్నప్పటికీ భవన నిర్మాణాల విషయంలో ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ వాస్తు నమ్మకాలు చాల ఎక్కువే. ఆ కారణంగా కోట్లు ఖర్చు చేసి వాస్తు దోషాలు సరి చేయించుకోవడం, ఉన్న భవనాలని కూలగొట్టుకొని మళ్ళీ కొత్తవి నిర్మించుకోవడం వంటి ఆలోచనలు చేస్తుంటారు. అందుకు వారిద్దరూ కోట్లాది రూపాయల ప్రజాధనం చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. దానిని వారు తప్పనుకోకపోవడమే విచిత్రం. ఈ విషయంలో చంద్రబాబు కంటే కెసిఆర్ ఎప్పుడూ మరో రెండడుగులు ముందే ఉంటారు. 

హైదరాబాద్ నగరం నడిబొడ్డున సువిశాలమైన ప్రదేశంలో చాలా చక్కగా నిర్మించిన సచివాలయం నుంచే ఇన్ని దశాబ్దాలుగా సమైక్య రాష్ట్ర పాలన సాగింది. ఆ సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునికమైన సచివాలయం నిర్మించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్లాన్ గీయించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్లాన్ని కూడా పక్కనపడేసి మళ్ళీ కొత్త ప్లాన్ గీయించబోతున్నారు. ఇదివరకు గీయించిన ప్లాన్ ప్రకారం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘యూ’ ఆకారంలో మూడు వేర్వేరు భవన సముదాయాల తో కూడిన సచివాలయం నిర్మించాలను కొన్నారు. దానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దానిని తగ్గించేందుకు ఇప్పుడు 5 లక్షల చందరపు అడుగుల విస్తీర్ణంలో 10 అంతస్తుల భవనం ఒకటే నిర్మించాలని నిర్ణయించారు. దానిని సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో తెలంగాణా సంస్కృతికి అద్దం పట్టేదిగా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. దాని కోసం మళ్ళీ కొత్త ప్లాన్ సిద్దం చేయవలసిందిగా ఆయన అధికారులని ఆదేశించారు. 

ఏపి ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో సచివాలయం లేదు కనుక వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకోవడం సమంజసమే. ఇప్పుడు అది పూర్తిగా సిద్దం అయిపోయింది కనుక హైదరాబాద్ లోని  సచివాలయాన్ని ఖాళీ చేసి ఏపి ఉద్యోగులు అందరూ అక్కడికి తరలి వెళ్ళిపోయారు కూడా. కనుక ప్రస్తుతం ఉన్న సచివాలయం మొత్తం తెలంగాణా ప్రభుత్వమే ఉపయోగించుకోవచ్చు. కానీ దానిని కూల్చివేసి కొత్తది కట్టుకోవాలనుకొంటున్నారు కెసిఆర్. కనుక ఆంధ్రా ఉద్యోగులులాగే, తెలంగాణా సచివాలయ ఉద్యోగులు కూడా మూట ముల్లె సర్దుకొని వేరే చోటికి తరలి వెళ్ళక తప్పదు. ఇది చూసి నవ్వాలో ఏడవాలో తెలియదు.

అమరావతిలో శాశ్విత సచివాలయం నిర్మించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ఏపి సిఎం చంద్రబాబు సుమారు రూ.500-700 కోట్లు ప్రజాధనం వృధా చేసి వెలగపూడిలో ఇంద్రభవనం వంటి ‘తాత్కాలిక సచివాలయం’ కట్టుకొంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్న సచివాలయాన్ని కూలద్రోసుకొని కొత్తది కట్టుకోవడానికి ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఇద్దరికీ ఏమి తేడా ఉంది?

ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వానికి సచివాలయ భవనం లేకపోయుంటే కట్టుకొన్నా అర్ధం ఉంది కానీ అద్భుతంగా నిర్మించిన సచివాలయాన్ని కూలద్రోసుకొని కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేసి కొత్తది కట్టు కోవడందేనికో..ఉద్యోగులని ఇబ్బంది పెట్టడం దేనికో అర్ధం కాదు. ప్రజాధనాన్ని ధర్మకర్తలుగా కాపాడవలసిన ముఖ్యమంత్రులే ఈవిధంగా విచ్చలవిడిగా దుబారా చేస్తుండటం చాలా శోచనీయం.

ఒకపక్క విద్యార్ధుల ఫీజ్ రీఎంబర్స్ మెంట్ చేయడానికి కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెరాస సర్కార్ ఈవిధంగా గాలి మేడలు కట్టడం దేనికో అర్ధం కాదు. ఇరువురి తీరు చూస్తుంటే ముఖ్యమంత్రుల ముచ్చట్ల కోసం ప్రజాధనం వృధా కావలసిందేనా? ముఖ్యమంత్రులు ప్రజలకి జవాబుదారి కారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 


Related Post