చిరంజీవికి ఆ షో అవసరమా ఇప్పుడు?

October 15, 2016


img

తెలుగు సినీ పరిశ్రమని ఒకప్పుడు ఏఎన్.ఆర్., ఎన్టీఆర్ ఏలేరు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం ఏలారు. కానీ ఆయన తన కెరీర్ చాలా పీక్ టైంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమని వదిలేసి రాజకీయాలలోకి వెళ్ళారు. అది చాలా పెద్ద పొరపాటని తరువాత తేలింది. రాజకీయాలలో చేరి కేంద్రమంత్రి పదవి చేపట్టినప్పట్టికీ రాజకీయాలలో రాణించలేకపోయారు. స్వయంకృతాపరాదాలు కొన్నయితే, కాంగ్రెస్  పార్టీ నష్టజాతక ప్రభావం వలన మరికొంత నష్టపోయారు. అదేవిధంగా ఆయన రాజకీయాలలో చేరడం వలన సినిమాలలో సంపాదించుకొన్న గొప్ప పేరు ప్రతిష్టలకి కూడా భంగం కలిగింది. దానికీ మళ్ళీ అవే కారణాలు. ‘భూమి గుండ్రంగా ఉండును’ అన్నట్లుగా ఆయన మళ్ళీ  పోగొట్టుకొన్న చోటే ఉంగరం వెతుక్కొనే పనిలో పడ్డారు.

సుమారు పదేళ్ళ విరామం తరువాత మళ్ళీ ఖైదీ నెంబర్: 150 గా తెలుగు ప్రజల ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినపుడు, మధ్యలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎందుకు ఒప్పుకొన్నారో ఎవరికీ అర్ధం కాదు. 150వ సినిమా మీద అభిమానులలో చాలా బారీగా అంచనాలు పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడం పొరపాటేనని చెప్పక తప్పదు. 

“వచ్చెడివాడు ఫల్గుణుడు” అన్నట్లుగా ఈ షోని చేసేవాడు చిరంజీవి కనుక ఇదివరకు చేసినవారి అందరి కంటే ఆయన చాలా చాలా గొప్పగా చేస్తారని అభిమానులు ఆశిస్తే తప్పు కాదు. కనుక మళ్ళీ వారి అంచనాలని అందుకోవడం కోసం ఒత్తిడి పెరుగుతుంది. 

సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తడబడకుండా చాలా ధారాళంగా మాట్లాడటం, సమయస్ఫూర్తి, హాస్యచతురత వంటివి  చాలా అవసరం. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేంతాడంత డైలాగులు ఏమాత్రం తడబడకుండా చెప్పి ప్రేక్షకులని ఆకట్టుకోగలరు కానీ తడబడకుండా ప్రసంగాలు చేయలేరని అందరికీ తెలుసు. ఈ షోలో అటువంటి ప్రసంగాలు ఏమీ చేయనవసరం లేదు కానీ ఆ సామర్ధ్యం ఉన్నవాళ్ళయితే షో ఇంకా రక్తి కడుతుంది. 

ఈ షో ని అందరికంటే ముందు చేపట్టి చాలా గొప్పగా రక్తి కట్టించిన అమితాబ్ బచ్చన్ ఎందుకు చేతులు నులుపుకొనేవారో తెలియదు కానీ ఆనాటి నుంచి నేడు చిరంజీవి వరకు అందరూ చేతులు నులుపుకొంటూనే ఉన్నారు. కనుక ఆనాడు అమితాబ్ బచ్చన్ సెట్ చేసిన ఆ చేతులు నులుపుడుని కూడా అనుకరిస్తూ ఈ షో మొదలుపెట్టబోతున్న చిరంజీవి తన ముద్ర వేస్తారో లేదో చూడాలి. 


Related Post