ఆ ఆఫర్ ని ఔననలేదు..కాదనలేదు

October 15, 2016


img

“ఉగ్రవాదానికి మేము బలౌతూనే ఉన్నాము..దానిపై తీవ్రంగా పోరాడుతూనే ఉన్నాము..” అని నగనాచి కబుర్లు చెపుతూ అగ్రరాజ్యాల నుంచి ఏటా కోట్ల డాలర్లు పిండుకొంటున్న పాకిస్తాన్, దానిని ఉగ్రవాదం పెంచి పోషించడానికే ఉపయోగిస్తున్న సంగతి అగ్రరాజ్యాలకి తెలుసు. కానీ పాక్ తో వాటి అవసరాలు వాటికీ ఉన్నాయి కనుక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. అందుకు ప్రతిగా అమెరికా యుద్ద విమానాలు ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు పాక్ సరిహద్దు భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు కురిపించి వెళ్ళిపోతున్నా పాక్ ప్రభుత్వం, సైన్యం చూసిచూడనట్లు ఊరుకొంటాయి. అదే భారత్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులో తిష్టవేసుకొని కూర్చొన్న ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేపడితే చాలా రోషం వచ్చేస్తుంది. కానీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు పాక్ అంగీకరించడం లేదు కనుక ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం భారత్ పైకి మరింత మంది ఉగ్రవాదులని పంపిస్తూ దాడులు చేయిస్తోంది. 

భారత్ మళ్ళీ పాకిస్తాన్ కి తగినవిధంగా గుణపాఠం చెప్పగలదు కానీ అది యుద్దానికి దారి తీసే ప్రమాదం ఉంది కనుక వ్యూహాత్మకంగా నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. “ఒకవేళ పాకిస్తాన్ లో తిష్ట వేసుకొన్న ఉగ్రవాదులని పాక్ ప్రభుత్వం నిర్మూలించలేకపోతుంటే దానికి భారత్ కూడా సహాయపడుతుందని ప్రకటించారు. 

ఇది ఎవరూ ఊహించని ఆఫరే అని చెప్పక తప్పదు. కానీ దానిని స్వీకరిస్తే పాక్ పై ప్రస్తుతం అగ్రరాజ్యాలు పెత్తనం చేస్తున్నట్లుగానే భారత్ పెత్తనాన్ని కూడా అంగీకరించవలసి వస్తుంది. పైగా పాక్ ఉగ్రవాదులకి ఆశ్రయం, శిక్షణ, రక్షణ కల్పిస్తోందని అంగీకరించినట్లు అవుతుంది. పాక్ పాలకులు, సైన్యాధికారులు కూడా బహుశః భారత్ నుంచి ఇటువంటి ఆఫర్ ని ఊహింఛి ఉండరు కనుక షాక్ అయ్యుండవచ్చు. 

పాక్ ఈ ఆఫర్ ని స్వీకరించడం అసంభవం కనుక, ఉగ్రవాదుల నిర్మూలనకి సహాయం చేయడానికి భారత్ స్వయంగా ముందుకు వచ్చినప్పటికీ పాక్ అందుకు అంగీకరించలేదని భారత్ అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. భారత్ పైకి ఉగ్రవాదులని పంపించి దెబ్బ తీయాలని చూస్తుంటే, భారత్ కేవలం ఇటువంటి మాటలతోనే పాక్ పై దౌత్య విజయం సాధిస్తోంది. యూరీ దాడుల తరువాత వరుసగా జరిగిన పరిణామాలని అన్నిటినీ నిశితంగా గమనించినట్లయితే ఈ విషయం అర్ధం అవుతుంది. 

కానీ ముంబై, పఠాన్ కోట్, యూరీ దాడుల ఆరోపణలనే బలంగా త్రిప్పి కొడుతూ వాటి నుంచి అవలీలగా తప్పించుకొన్న పాకిస్తాన్ కి దీనిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. తమ దేశంలో కూడా భారత్ ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని పాక్ ఆరోపణలు చేస్తోంది కనుక, భారత్ లో ఉగ్రవాదులని నిర్మూలించేందుకు తామే భారత్ కి సహాయం చేస్తామని బదులివ్వవచ్చు.


Related Post