ఉగ్రవాదులు వ్యూహం మార్చేరా?

October 15, 2016


img

సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన తరువాత నుండి కాశ్మీర్ లో ఆర్మీ క్యాంపులపై, సైనికుల వాహనాలపై ఉగ్రవాదుల దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. సహస్ర సీమా బల్ కి చెందిన సైనికులు నిన్న రాత్రి శ్రీనగర్ లో తమ విధులు ముగించుకొని నాలుగు వాహానాలలో తమ ఆర్మీ క్యాంప్ కి తిరిగి వెళుతుండగా ఉగ్రవాదులు మాటువేసి, చివరి వాహనంపై దాడులు జరిపారు. వారి దాడిలో ఒక సైనికుడు మృతి చెందగా మరొక సైనికాధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఏడుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఈ దాడి శ్రీనగర్ శివార్లలో జకురా అనే ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఉగ్రవాదులు తమ వాహనాలపై కాల్పులు జరుపగానే, ముందు వెళుతున్న మూడు వాహనాలలోని  సైనికులు కూడా వెంటనే ఎదురు కాల్పులు జరపడం మొదలుపెట్టడంతో ఉగ్రవాదులు పారిపోయారు.

 యూరీ దాడుల తరువాత ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చుకొన్నట్లుగా కనబడుతోంది. గెరిల్లా పద్దతిలో ఒకరిద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడులు చేసి పారిపోతున్నారు. కనుక వారిని ఎదుర్కోవడం సైనికులకి కూడా కష్టంగానే మారుతోంది. వారు ఎప్పుడు ఎక్కడ ఎటు నుంచి వచ్చి దాడులు చేస్తారో తెలియకుండా ఉంది. వారి వ్యూహంలో కొట్టవచ్చినట్లు కనబడుతున్న మరో మార్పు  ఏమిటంటే వారు ఇప్పుడు ప్రధానంగా సైనికులు, పోలీస్ స్టేషన్లనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. జనావాసాల మధ్య సైనికుల దాడులు చేస్తుండటం కూడా మరో సరికొత్త వ్యూహంగానే భావించవచ్చు. 

నిన్న రాత్రి కూడా అలాగే చేశారు. దాని వలన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరుపగలుగుతున్నారు కానీ సైనికులు ఎదురు కాల్పులు జరుపలేకపోతున్నారు. ఒకవేళ వారి కాల్పులలో ఎవరైనా సామాన్య పౌరుడు గాయపడినా, మృతి చెందినా దాని వలన కూడా మళ్ళీ ఆందోళనలు మొదలయ్యే అవకాశం ఉండటంతో సైనికుల చేతులు కట్టివేసినట్లవుతోంది. 

శ్రీనగర్, కాశ్మీర్ ప్రాంతాలలో జనావాసాల మధ్యన ఉగ్రవాదులు కాల్పులు జరుపగలుగుతున్నారంటే దానర్ధం స్థానికంగా ఉన్నవారు ఎవరో వారికి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తేనే అది సాధ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ రాష్ట్రంలో రాజకీయ నాయకులే వేర్పాటువాదులని, ఉగ్రవాదులకి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు ఉగ్రవాదులని నిలువరించడం సాధ్యమా? సాధ్యం కాకపోతే మన సైనికులు ఉగ్రవాదులు చేతిలో నిత్యం ఇలాగ ప్రాణాలు కోల్పోతుండవలసిందేనా? ఉగ్రవాదులు తమ వ్యూహం మార్చుకొన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా తన సైనికులని, దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రతివ్యూహం సిద్దం చేసుకోవడం తప్పనిసరి.



Related Post