మళ్ళీ బాంబు పేల్చిన ములాయం

October 14, 2016


img

ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా తండ్రి తన కొడుకుని వారసుడిగా చేసి అతని ఎదుగుదలకి సహకరిస్తాడు కానీ యూపిలో అందుకు భిన్నంగా జరుగుతుండటం విశేషం. అక్కడ తండ్రి ములాయం స్వయంగా తన కొడుకు అఖిలేష్ యాదవ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తమ్ముడు శివపాల్ యాదవ్ ని ఆ సీటులో కూర్చోబెట్టారు. 

ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పార్టీ గెలిస్తే మళ్ళీ అతనే ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అనుకోవడం సహజం కానీ ఆ గ్యారంటీ ఏమీ లేదన్నట్లు ములాయం మాట్లాడటం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో నిర్ణయిస్తామని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. 

ఎన్నికలకి ముందు తండ్రే తన కొడుకు గురించి ఈవిధంగా మాట్లాడటం రాజకీయంగా ఆ పార్టీ ఆత్మహత్య చేసుకోవడమేనని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కొడుకు మీద స్వంత తండ్రికే నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజలు ఆయనని ఏవిధంగా నమ్మగలరు? అని ప్రతిపక్షాలు అడగకమానవు. ఇప్పటికే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇండియా టుడే సర్వేలో తేల్చి చెప్పింది. ఈరోజు ములాయం సింగ్ యాదవ్ చెప్పిన ఈ చిన్న మాట ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లయింది కనుక ఆ పార్టీ పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. 

అయితే అపార రాజకీయ అనుభావజ్ఞుడైన ములాయం సింగ్ కి ఇంత చిన్న సంగతి తెలియదనుకోలేము. మరి తెలిసీ ఈవిధంగా ఎందుకు అన్నారంటే ఎన్నికలలో గెలిచేందుకు తన తమ్ముడు సహాకారం చాలా అవసరం కనుకనే. ఒకవేళ ములాయం సింగ్ యాదవ్ తన కొడుకునే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, ముఖ్యమంత్రి పదవి కోసం చాలా కాలంగా ఆశపడుతున్న తమ్ముడు శివపాల్ యాదవ్ పార్టీని చీల్చవచ్చు లేదా కొడుకుకి సమస్యలు సృష్టించవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తు ఎన్నికలలో మళ్ళీ సమాజ్ వాదీ పార్టీయే విజయం సాధిస్తే, అప్పుడు ములాయం సింగ్ పార్టీలో తమ్ముడితో సహా అందరినీ నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక అప్పుడు మళ్ళీ కొడుకునే గద్దెపై కూర్చోబెట్టుకోవచ్చు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పార్టీలో అందరినీ ఏదో ఒక ఆశ కల్పించుతూ పార్టీ నిలువునా చీలిపోకుండా కాపాడుకోవాలి కనుకనే ములాయం సింగ్ ఆవిధంగా ప్రకటించి ఉండవచ్చు.


Related Post