చంద్రబాబు చెవిలో జోరీగ?

October 14, 2016


img

ఏపిలో చంద్రబాబు ప్రభుత్వానికి చెవిలో జోరీగలాగ, పక్కలో బల్లెంలాగా తయారయ్యారు ముద్రగడ పద్మనాభం. కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన చేస్తున్న ఉద్యమాలు తెదేపా ఓటు బ్యాంక్ ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున ఆయనని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తెదేపా సర్కార్ చాలా ఇబ్బంది పడుతోంది. 

ముద్రగడ చేస్తున్న ఉద్యమాల వెనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెదేపాకి కూడా తెలుసు కానీ ఆయనని కట్టడి చేయలేకపోతోంది. ముద్రగడ తన లక్ష్యం కోసం పోరాడకుండా జగన్ చేతిలో కీలుబొమ్మలాగ మారిపోయి అతని తరపున చంద్రబాబుతో రాజకీయ యుద్దాలు చేస్తున్నారు. ఏపిలో ప్రతిపక్షాలు చంద్రబాబుని వ్యతిరేకిస్తుంటాయి కనుక అవి కూడా ముద్రగడతో చేతులు కలిపాయి. కనుక ఆయన ఇదివరకటికంటే చాలా బలం పుంజుకొన్నట్లే ఉన్నారు. 

ఆయన జగన్ ప్రోద్భలంతోనే ఈ ఉద్యమాలు మొదలుపెట్టిన సంగతి బహిరంగ రహస్యమే. కనుక జగన్ రాజకీయ లక్ష్యాల కోసమే ఆయన పోరాడుతున్నట్లు అనుమానించవలసి వస్తుంది. 

వచ్చే ఎన్నికలలో ఏపిలో కాపులని, బీసిలని కూడా తెదేపాకి దూరం చేసి వైకాపాకి మద్దతు పలికేలా చేయడం, తద్వారా వైకాపా గెలిచి తాను  ముఖ్యమంత్రి అవడం కోసమే జగన్ ముద్రగడని ముందుకు తీసుకువచ్చినట్లు అనుమానం కలుగుతోంది. అవసరమైతే ముద్రగడ చేతే రాజకీయ పార్టీ పెట్టించి వచ్చే ఎన్నికలలో కాపులని చంద్రబాబు వైపు మొగ్గకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. 

ముద్రగడకి కూడా తన లక్ష్యం మీద శ్రద్ధ, చిత్తశుద్ధి లేదు కనుకనే దాని కోసం గట్టిగా పోరాడకుండా జగన్ మాదిరిగానే ఆయన కూడా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి 5 రోజులపాటు కాపు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించబోతున్నట్లు ఆయన  ఇవ్వాళ్ళ ప్రకటించారు. ఈవిధంగా ఆయన తన ఉద్యమాలకి మద్యలో విరామాలు ఇస్తూ కొనసాగిస్తుండటం గమనిస్తే ఆయన వచ్చే ఎన్నికల వరకు తన ఉద్యమాల వేడి తగ్గిపోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్, చంద్రబాబు మద్య జరుగుతున్న ఈ ఆధిపత్యపోరులో తను పావుగా మారిన సంగతి గ్రహించక, నానాటికీ పెరుగుతున్న తన పాపులారిటీని చూసి  ముద్రగడ మురిసిపోతున్నారు. కానీ చివరికి ఆయన బలిపశువుగా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.    


Related Post