తెరాస సర్కార్ మేల్కొంటుందో లేదో?

October 14, 2016


img

తెలంగాణా ఏర్పడిన తరువాత ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఘనవిజయాలు సాధిస్తూనే వచ్చింది కనుక ప్రజలు అందరూ తమవైపే ఉన్నారని, తమ పాలనని ఆమోదిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా ఆపార్టీ నేతలు అందరూ గొప్పలు చెప్పుకొంటారు. కానీ వాస్తవం ఏమిటో వారికీ తెలుసు ప్రజలకీ తెలుసు. ఎన్నికలకి ముందు ప్రతిపక్షాలకి చెందిన ముఖ్య నేతలని పార్టీ ఫిరాయింపజేసి, ఎన్నికలు జరిగే ప్రాంతంలో తెరాస మంత్రులు, నేతలని బారీ ఎత్తున మొహరింపజేసి దానిని ఒక యుద్ద క్షేత్రంగా మార్చివేసి తెరాస విజయం సాధిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆవిధంగా ఎన్నికలలో గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని తెరాస గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే. దాని వలన చివరికి అదే నష్టపోతుంది తప్ప ప్రతిపక్షాలు, ప్రజలు కాదు. అప్రజాస్వామిక, అనైతిక విధానాల ద్వారా తెరాస విజయాలు సాధించవచ్చు కానీ అది ఎల్లకాలం పనిచేయదనే సంగతి గ్రహించడం మంచిది. 

రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసి అవి ఇక ఎన్నటికీ కోలుకోలేవని, ఇక తనకి ఎదురు లేదని భావిస్తున్న సమయంలో అవి మళ్ళీ బలం పుంజుకొని దానిని సవాలు చేయగలుగుతున్నాయి. అందుకు కారణం తెరాస సర్కార్ చేస్తున్న తప్పులేనని చెప్పక తప్పదు. 

ప్రజాస్వామ్య వ్యవస్థపై కెసిఆర్ కి నమ్మకమున్న లేకపోయినా, ఈ వ్యవస్థలో ప్రతిపక్షాలు లేకుండా చేయడం అసాధ్యమే..ఒకే పార్టీ శాస్వితంగా అధికారంలో కొనసాగడమూ కష్టమే. 

ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిజాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్ళీ పుంజుకొన్న మాట వాస్తవం. గ్రేటర్ ఎన్నికల తరువాత చాలా బలహీనపడిన భాజపా మళ్ళీ ప్రభుత్వంపై తన పోరాటాలని ప్రారంభించింది. పంట రుణాల హామీ అమలు, గిట్టుబాటు ధరలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, నకిలీ విత్తనాలు వంటి రైతులకి సంబంధించిన సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. ఈరోజు సచివాలయం ముందు ధర్నాతో వారు తమ పోరాటాన్ని మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వం రూ.90 కోట్లు ఇచ్చినా రాష్ట్రంలో రైతుల ఈ సమస్యలని తెరాస సర్కార్ ఎందుకు పరిష్కరించడం లేదని భాజపా నేతలు ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భాజపా బాటలోనే రైతుల సమస్యలపై పోరాటాలకి సిద్దం అవుతున్నారు. రాష్ట్రం ఆర్ధికంగా బలంగా ఉందని ప్రభుత్వమే చెపుతున్నప్పుడు రైతులని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. బహుశః నేడోరేపో తెదేపా, వామపక్షాలు కూడా వారితో గొంతు కలిపి తెరాస సర్కార్ విమర్శలు గుప్పించవచ్చు. తెలంగాణా ప్రజలలో చాలా గౌరవం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం కూడా తెరాస సర్కార్ తీరుని తప్పు పడుతున్నారు. 

తెరాస సర్కార్ తాము రైతు పక్షపాతినని చెప్పుకొంటుంటే, ప్రతిపక్షాలు సరిగ్గా అదే అంశంపై దానిని నిలదీస్తుండటం విశేషం. ప్రస్తుతం తెరాస అధికారంలో ఉంది కనుక అది ప్రతిపక్షాల విమర్శలని పట్టించుకోకపోయినా దానికేమీ నష్టం ఉండకపోవచ్చు. కానీ అవి సందిస్తున్న ఈ ప్రశ్నలు ప్రజలని ఆలోచింపజేయకుండా ఉండవు. అవి చేస్తున్న ఈ పోరాటాల కారణంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడకుండా ఉండదు. కనుక ప్రతిపక్షాలు విమర్శలని త్రిప్పి కొట్టే ప్రయత్నాలు చేయడం కంటే అవి చూపిస్తున్న లోపాలని సవరించుకోవడం చాలా మంచిది. లేకుంటే చేతులు కాలక ఆకులు పట్టుకొని బాధపడవలసి రావచ్చు. 


Related Post