కోదండరాం వారితో కలిస్తే మంచిదేమో?

October 14, 2016


img

తెలంగాణాలో ప్రతిపక్షాలు తెరాస సర్కార్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అది సహజమే. తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా అచ్చం ఒక ప్రతిపక్ష నాయకుడిలాగే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నాయో ఆయన కూడా సరిగ్గా అటువంటి వైఖరే ప్రదర్శిస్తున్నారు. అయన మాటలలో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి, అసహనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. 

నాంపల్లిలో మొన్న తెలంగాణా రాజకీయ జేఏసి సమావేశం అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడిన మాటలే అ మరునాడు కాంగ్రెస్ ఏమ్మేల్సీ షబ్బీర్ అలీ నోట యదాతదంగా వినిపించడం చూస్తే వారి ఆలోచనలు, అభిప్రాయలు ఎంతగా కలుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.  

చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ధనిక రాష్ట్రం అని (ముఖ్యమంత్రి కెసిఆర్) చెప్పుకొంటున్నప్పుడు విద్యార్ధుల ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ మొదలైన సంక్షేమ పధకాలకి ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? తెరాస అధికారంలోకి వస్తే రైతులకి పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ వాటిని ఇంతవరకు మాఫీ చేయలేదు. తెరాస ఇంకా అనేక హామీలు కూడా ఇచ్చింది కానీ వాటిలో చాలా హామీలు అమలుచేయలేదు. స్వయంగా ప్రభుత్వం ప్రకటించిన అనేక పధకాలకి నిధులు విడుదల చేయకపోవడం వలన సబంధిత వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెరాస ప్రభుత్వం తన ఆదాయవ్యయాలని బహిర్గతం చేస్తే బాగుంటుంది. ధనిక రాష్ట్రమని చెప్పుకొంటూ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో ప్రభుత్వం ప్రజలకి సంజాయిషీ ఇవ్వాలి,” అని అన్నారు. 

ఆ మరునాడు మాట్లాడిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా ఇంచుమించు ఆయన అడిగిన ప్రశ్నలనే అడిగారు. ప్రొఫెసర్ కోదండరాం విద్యార్ధుల సమస్యల పరిష్కారం కోసం యాత్ర చేపట్టాలని ఆలోచిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యల పరిష్కారం కోసం యాత్ర చేయాలని ఆలోచిస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలలో వాటి రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాదలచుకోలేదని చెపుతున్నారు కనుక ఆయన ఏమి ప్రయోజనం ఆశించి ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నారనేదే అంతుపట్టడం లేదు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, తెదేపా, భాజపాలు చేస్తున్న పోరాటాలనే ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న పోరాటాలని మాత్రం ప్రభుత్వం ఎందుకు పట్టించుకొంటుంది? కనుక ఆయన సమస్యల పరిష్కారానికి ఒంటరిపోరాటం చేయడం కంటే ప్రతిపక్షాలతో కలిసి చేయడం మంచిదేమో? ఆలోచిస్తే బాగుంటుంది. 


Related Post