పాపం పాకిస్తాన్!

October 13, 2016


img

పాకిస్తాన్ పని తేలు కుట్టిన దొంగ పరిస్థితిలా ఉందిప్పుడు. కారణాలు ఏవైతేనేమి సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని గట్టిగా వాదిస్తోంది కనుక ఆ బాధని దిగమింగుకోవలసి వస్తోంది. తనే స్వయంగా అటువంటిదేమీ జరుగలేదని చెప్పుకొంటోంది కనుక అందుకు భారత్ ని నిందించలేకపోతోంది పాపం. పైగా సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు పాక్ ప్రజలతో సహా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసినప్పటికీ జరుగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తునందున నవ్వులపాలవుతోంది. 

యూరీ దాడుల తరువాత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించి మరీ భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం ఇంకా అవమానకరంగా మారింది. భారత్ అటువంటి సాహసానికి పూనుకొంటే బలంగా త్రిప్పికొడతామని, భారత్ తో యుద్దానికి సిద్దంగా ఉన్నామని ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ అధికారులకి, సర్జికల్ స్ట్రయిక్స్ చెప్పు దెబ్బవంటిదేనని చెప్పవచ్చు. 

అందుకే వారు ఆ బాధని, అవమానాన్ని దిగమింగుతూ దానిని భరించలేక, పైకి చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అసలు జరుగలేదని వితండవాదం చేస్తున్న పాక్ పాలకులకి, పాక్ ఆర్మీకి పుండు మీద కారం చల్లినట్లు అమెరికా ఒక ప్రకటన చేసింది. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం సమంజసమేనని, అది కేవలం ఆత్మరక్షణ కోసమే చేసినవే కనుక వాటిని అమెరికా సమర్దిస్తుందని ప్రకటించింది. అంతేకాదు..పాక్ పేరు చెప్పకపోయినా యూరీలో జరిగినవి పాక్ ఉగ్రవాదుల పనే అని తేల్చి చెప్పింది. అటువంటి వాటిని తాము సమర్దించబోమని స్పష్టం చేసింది. ఎన్.ఎస్.జి. గ్రూప్ లో భారత్ కి సభ్యత్వం కల్పించేందుకు అమెరికా అన్ని విధాల సహకరిస్తుందని ప్రకటించింది. 

అమెరికా చేసిన ఈ తాజా ప్రకటన పాకిస్తాన్ కి జీర్ణించుకోవడం కష్టమే. ముఖ్యంగా సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని తాము వాదిస్తుంటే అగ్రరాజ్యమైన అమెరికా అవి జరిగాయని చెప్పడమే కాకుండా వాటిని సమర్ధిస్తూ మాట్లాడటం పాకిస్తాన్ కి పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది. అమెరికా చెప్పింది అంటే యావత్ ప్రపంచం కూడా నమ్ముతుంది. 

వాస్తవానికి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి పాకిస్తాన్ని యుద్దానికి కవ్వించినందుకు ప్రపంచదేశాలన్నీ భారత్ కి చివాట్లు పెట్టి ఉండాలి కానీ అన్నీ ప్రశంసిస్తున్నాయి..భారత్ ని సమర్ధిస్తున్నాయి కూడా. అదే సమయంలో సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని బుకాయిస్తూ పాక్ నవ్వులపాలవుతుండటం చాలా విచిత్రంగానే ఉంది.


Related Post