కెసిఆర్ ఆ బలహీనతని జయించగలరా?

October 13, 2016


img

తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా గ్రేటర్ హైదరాబాద్ లో తెరాసకి ఏమాత్రం పట్టు ఉండేది కాదనే విషయం అందరికీ తెలుసు. జంటనగరాలలో ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారి సంఖ్య  ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. కానీ సుమారు ఏడాది పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేసిన అనేక వ్యూహాలు, రాజకీయ ప్రణాళికలు కారణంగా గ్రేటర్ పీఠం తెరాస దక్కించుకోగలిగింది. ఇది తెరాస విజయమో లేదా మంత్రి కెటిఆర్ విజయమో అనడం కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ విజయమేనని చెప్పవచ్చు. ఆ ఒక్క ఎన్నికలే కాదు ఈ రెండేళ్ళలో రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికల విజయానికి క్రెడిట్ కెసిఆర్ దేనని చెప్పక తప్పదు.  ఆయన ప్రతీ ఎన్నికలకి చాలా ముందు నుంచే చాలా దూరదృష్టితో మంచి ప్రణాళిక, మంచి వ్యూహాలు, సిద్దం చేసుకొంటుంటారు. గ్రేటర్ ఎన్నికలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

హైదరాబాద్ జంట నగరాలలో కాంగ్రెస్, తెదేపా, భాజపా, మజ్లీస్ పార్టీలకి ఉన్న పట్టు గురించి తెలిసిఉన్నప్పటికీ గ్రేటర్ ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తామని కెసిఆర్ ప్రకటించినప్పుడే ఆయన విజయం సాధించేశారు. అంత ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగుతున్నారు కనుకనే తెరాస వరుస విజయాలు సాధిస్తోందని చెప్పవచ్చు.

ఎన్నికలని ఎదుర్కొనే విషయంలో భాజపా, కాంగ్రెస్, తెదేపాలు మూడూ కూడా కేవలం మాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ కెసిఆర్ మాత్రం వచ్చే ఎన్నికలకి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేసినట్లే ఉన్నారు. మైనార్టీలని ప్రసన్నం చేసుకోవడం కోసం అయన చేస్తున్న ప్రయత్నాలని గమనించినట్లయితే వచ్చే ఎన్నికలలో మజ్లీస్ పార్టీని కూడా దూరంగా ఉంచాలని అయన ఆలోచిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. అందుకు బలమైన కారణమే కనబడుతోంది. 

మజ్లీస్ పార్టీకి మజ్లీస్ పార్టీకి ఆగ్రహం కలిగితే రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంక్ తెరాసకి దూరం అవుతుందనే భయంతోనే కెసిఆర్ తెలంగాణా విమోచన దినోత్సవం జరుపడానికి వెనుకాడుతున్నారని భాజపా విమర్శించింది. 

భాజపా విమర్శల సంగతి పక్కనబెడితే, వాటిలో తెరాస బలహీనతని ముఖ్యమంత్రి కెసిఆర్ సరిగ్గా గ్రహించినట్లే ఉన్నారు. అయితే ఆయన బయటపడకుండా ఆ బలహీనతని అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. అందుకే ఇప్పటి నుంచే రాష్ట్రంలో ముస్లింలని మెల్లగా తెరాసవైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. తద్వారా ఇకపై తెరాసపై మజ్లీస్ ముద్ర లేకుండానే స్వయంగా రాష్ట్రంలో ముస్లిం ప్రజల ఓట్లను పొందేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

రెండు రోజుల క్రితం తెరాసలోని ముస్లిం నేతలు ఆయనని కలిసినప్పుడు, ముస్లింలకి అనేక వరాలు ప్రకటించడమే కాకుండా, ముస్లింల జనాభా ప్రాతిపదికన అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పడం గమనిస్తే, ఆయన చాలా దూరదృష్టితో ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాలని అమలు చేయడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణాలో నేటికీ ఎంతో బలంగా ఉన్న ప్రతిపక్షాలు, ఈ విషయంలో తమ రాజకీయ శత్రువైన కెసిఆర్ నుంచే పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం.  


Related Post