పార్రికర్ ఆవిధంగా మాట్లాడటం సరికాదేమో?

October 13, 2016


img

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగి ఇప్పటికి రెండు వారాలుపైనే అఅయ్యింది. కానీ ఇంకా దానిపై చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి జరిగినప్పుడు అధికార భాజపాతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందుకు మోడీ ప్రభుత్వాన్ని, ఆర్మీని చాలా మెచ్చుకొన్నాయి. కానీ ఆ తరువాత అన్ని పార్టీలు వాటిని రాజకీయ కోణంలో నుంచి చూస్తూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. 

మోడీ ప్రభుత్వం మొదట్లో వాటి గురించి చాలా హుందాగా వ్యవహరించడంతో దేశప్రజలందరూ చాలా హర్షించారు. ప్రధాని నరేంద్ర మోడీకి బాసటగా నిలిచారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా మెల్లగా సర్జికల్ స్ట్రయిక్స్ పై రాజకీయాలు చేయడం మొదలుపెట్టడం ఎవరూ ఊహించలేని విషయమే. 

అందుకు ఉదాహరణగా రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ చెప్పిన మాటలని ప్రస్తావించుకోవలసి ఉంటుంది. ముంబైలో నిన్న జరిగిన ఫోరం ఫర్ ఇంటిగ్రేటడ్ నేషనల్ సెక్యూరిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ “సర్జికల్ స్ట్రయిక్స్ పై భినాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అవి జరిగిన మాట వాస్తవం. సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో నేను కేవలం నిమిత్తమాత్రుడినే. వాటి ప్రణాళిక రూపకల్పనకి,  ప్రధాని నిర్ణయాలని ఆర్మీ అధికారులకి అందజేయడానికే నా పాత్ర పరిమితం. కనుక ఆ క్రెడిట్ మొత్తం మన ఆర్మీకి, దానిని అనుమతించిన ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది. దేశ ప్రజలందరికీ ఆ క్రెడిట్ లో భాగస్వాములే. కనుక వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా ఆ క్రెడిట్ లో భాగం పొందడవచ్చు,” అని మనోహర్ పార్రికర్ అన్నారు. 

సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ క్లెయిం చేసుకొనేందుకు భాజపా నేతలు, మోడీ ప్రభుత్వంలో మంత్రులు ఎంతగా ప్రయత్నిస్తే దాని వలన వారికి అంతగా నష్టపోయే ప్రమాదం ఉంది. దాని క్రెడిట్ గురించి మాట్లాడితే దేశ ప్రజలకి స్వయంగా తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, తన రాజకీయ లబ్ది కోసమే వాటి గురించి అతిగా ప్రచారం చేసుకొంటున్నారనే ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు విమర్శలు, ఆరోపణలు నిజమేనని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సర్జికల్ స్ట్రయిక్స్ గురించి భాజపా, మోడీ ప్రభుత్వం డప్పు కొట్టుకొన్నట్లయితే ఇంతవరకు సంపాదించుకొన్న గొప్ప పేరు పోగొట్టుకోవడమే కాకుండా, రాజకీయ లబ్ది కోసం అంతకి తెగించిందని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక సర్జికల్ స్ట్రయిక్స్ గురించి వారు మాట్లాడటం కంటే ప్రతిపక్షాలు, లోకాన్నే మాట్లాడనీయడం మంచిది. 


Related Post