ఈసారి మోడీ ప్రభుత్వానిదే పైచెయ్యి?

October 13, 2016


img

ఈరోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన డిల్లీలో భాజపా పార్లమెంటరీ వ్యవహారాల కేబినేట్ సంఘం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలని ఖరారు చేసే అవకాశం ఉంది. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో మొదలవుతుంటాయి. ఈసారి వాటిని నవంబర్ 15వ తేదీ నుంచే నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరుగబోయే సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. 

గత సమావేశాలకి పూర్తి భిన్నమైన వాతావరణంలో ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండున్నరేళ్ళలో ఇంతవరకు జరిగిన ప్రతీ పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏదో ఒక బలమైన అంశాన్ని లేదా సమస్యని ఆయుధంగా చేసుకొని మోడీ ప్రభుత్వానికి అగ్నిపరీక్షలు పెట్టేవి. కానీ ఈసారి సమావేశాలలో మోడీ ప్రభుత్వానిదే పైచెయ్యిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. 

సర్జికల్ స్ట్రయిక్స్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ, భారత్ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతోంది. చాలా దశాబ్దాల తరువాత భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ కి ధీటుగా జవాబు చెప్పిందని యావత్ ప్రపంచం అభిప్రాయపడుతోంది. దేశప్రజలు కూడా మోడీ ప్రభుత్వం చాలా సమర్ధంగా వ్యవహరించిందని మెచ్చుకొంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీని సమర్ధించవలసి వచ్చింది. కనుక ఈ నేపద్యంలో జరుగుతున్న శీతాకాల సమావేశాలలో విజయోత్సాహంతో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వద్ద బలమైన అంశం ఏదీ లేకపోవడంతో అస్త్రశస్త్రాల కోసం వెతుక్కోవలసి వస్తోంది. పార్లమెంటు సమావేశాలకి ఇంకా సమయం ఉంది కనుక ఆలోగా ఏవైనా సిద్దం చేసుకోవచ్చు. 


Related Post