సినీ పరిశ్రమ ఎక్కడ ఉండాలి?

October 12, 2016


img

ప్రముఖ తెలుగు సినిమా నటుడు తెదేపా ఎంపి మురళీ మొహన్ మీడియాతో మాట్లాడుతూ, “తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాలో ఉండాలా..లేదా తెలంగాణాలోనే ఉండాలా అనే విషయానికి ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. కనుక అది ఎక్కడ ఉన్నా ఒక్కటే. మన సినిమాలని విదేశాలలో షూటింగ్ చేయడం చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయిందిప్పుడు. మంచి లోకేషన్లు ఉంటే అక్కడే సినిమాలు తీసుకోవచ్చు,” అని అన్నారు. 

ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆ సమయంలో కొందరు ప్రముఖులు ఆంధ్రాకి తరలిపోవడమే మంచిదనే ఆలోచనలు కూడా చేశారు. అందుకు కారణం తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా చాలా మంది నేతలు తమ మాటలతో, చర్యలతో సినీ పరిశ్రమలో వారిలో తీవ్ర అభద్రతాభావం కల్పించారు. కానీ ఆ తరువాత సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండటం వలన నగరానికి అది ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా దాని ద్వారా ప్రభుత్వానికి బారీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం గ్రహించినప్పటి నుంచి వారి తీరులో చాలా మార్పు వచ్చింది. అందుకే తెలుగు సినీ పరిశ్రమని ఆంధ్రాకి చెందిన వారే నడిపిస్తున్నప్పటికీ వారు హైదరాబాద్ లోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు. అందరూ హైదరాబాద్ లో చాలా ప్రశాంతంగా తమ సినీ కార్యకలాపాలని నిర్వహించుకొంటున్నారు.ఆంధ్రాకి తరలి వెళ్ళే ఆలోచనలు ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. అదే మాట మురళీ మోహన్ చెప్పారని భావించవచ్చు.

కానీ తెలంగాణా నటీనటుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభని వెలికి తీయడానికి, అదేవిధంగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలని చాటిచెప్పేందుకు తెలంగాణా సినీ పరిశ్రమ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ముంబైలో హిందీ పరిశ్రమ ఎంత బలంగా ఉన్నప్పటికీ, మరాఠీ సినీ పరిశ్రమ కూడా అంతే బలంగా ఎదగడం చూసినట్లయితే, హైదరాబాద్ లో తెలంగాణా సినీ పరిశ్రమ కూడా ఆవిధంగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నట్లే చెప్పవచ్చు.   



Related Post