మోడీ హెచ్చరికలు..పాక్ కి సంతోషమే

October 12, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా నిన్న పాక్ కవ్వింపులకి చాలా ధీటుగా జవాబు చెప్పారు. ఆయన నిన్న లక్నోలో జరిగిన రామ్ లీలా ఉత్సవంలో పాల్గొన్నప్పుడు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “భారత్ ఎవరిపై యుద్ధం చేయాలని కోరుకోదు కానీ అవసరమైతే యుద్దానికి వెనకాడదు. రామాయణ, మహాభారత కాలం నుంచి భారత్ ఇదే విధానం పాటిస్తోంది. ఉగ్రవాదంపై మొదటిసారి జటాయువు పక్షి పోరాటం చేసింది. సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకొనిపోతుంటే రావణుడితో పోరాడింది. మనం కూడా చాలాకాలంగా ఉగ్రవాదంతో పోరాడుతూనే ఉన్నాము. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని శాంతిభద్రతల సమస్యగా మాత్రమే భావించిన చాలా దేశాలు కూడా ఇప్పుడు దానిపై పోరాడుతున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని నిర్మూలించక తప్పదు. అప్పుడే మానవాళి మనుగడ ఉంటుంది. కానీ మన పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే, దానికి మరో దేశం (చైనా) మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదాన్ని సమర్ధించే ఏ దేశానైనా తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. మనం ఎప్పుడూ శాంతిని కోరుకొంటాము. ఎవరితో కోరుండి కయ్యానికి కాలు దువ్వము. కానీ దానిని అలుసుగా తీసుకొని మనల్ని దెబ్బ తీయాలని చూస్తే అప్పుడు తప్పకుండా వాటికి ధీటుగా జవాబు చెప్పవలసి వస్తుంది,” అని మోడీ అన్నారు. 

చైనా, పాకిస్తాన్ లకి ప్రధాని నరేంద్ర మోడీ సూటిగానే హెచ్చరించారని చెప్పవచ్చు. కానీ ఆ హెచ్చరికలని అవి ఖాతరు చేస్తాయని ఆశించలేము. చైనా ఎన్నడూ భారత్ ని యుద్దానికి కవ్వించనప్పటికీ, ఆసియా ఖండంపై తన ఆధిపత్యం చాటుకొనేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. భారత్ కంటే తను అన్ని విధాల చాలా బలమైనదనే నిశ్చితాభిప్రాయం దానికి ఉంది. కనుక అదిమోడీ హెచ్చరికలని పట్టించుకోదు. ఇక భారత్ తో ప్రత్యక్ష యుద్ధం చేయాలని పాక్ చాలా ఉవ్విళ్ళూరుతోంది కనుక మోడీ యుద్ద ప్రతిపాదనని అది స్వాగతించవచ్చు. భక్తుడు కోరుకొన్నదే దేవుడు వరంగా ఇచ్చినట్లు అది మోడీ హెచ్చరికలని ఆనందంగా స్వీకరించి మున్ముందు భారత్ పై మరిన్ని ఉగ్రదాడులకి పాల్పడి యుద్దానికి కవ్వించవచ్చు.  


Related Post