ఇద్దరు చంద్రుల ప్రేరణ చూసి తీరాల్సిందే!

October 07, 2016


img

ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇటీవల కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్పారు. జిల్లాల పునర్విభజన గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ఆనాడు ఎన్టీఆర్ మండల వ్యవస్థని ప్రవేశపెట్టారని, దాని ప్రాముఖ్యతని గుర్తించి తాను కూడా దానికి మద్దతు ఇచ్చానని, అదే వ్యవస్త నేటికీ బలంగా కొనసాగుతోందని చెప్పారు.

హైదరాబాద్ ని తానే ఆభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు  గొప్పలు చెప్పుకొన్నప్పుడు, “అది నైజాం కాలంలోనే అభివృద్ధి చెందిందని” చెపుతూ కెసిఆర్ ఆయన గాలి తీసేస్తుంటారు కానీ చంద్రబాబు మావగారైన స్వర్గీయ ఎన్టీఆర్ గొప్పదనం అంగీకరించడం విశేషమే. చంద్రబాబుని కేసీఆర్ మెచ్చుకోకపోయినా ఆయనకీ చాలా ప్రేరణ కలిగిస్తుంటారు. అందుకు ఉదాహరణగా పార్టీ ఫిరాయింపులు గురించి చెప్పుకోవచ్చు.

రేవంత్ రెడ్డిని ఓటుకి నోటు కేసులో ట్రాప్ చేసిన తరువాత ఆయన, చంద్రబాబు నాయుడు చాలా నీచమైన పని చేశారని విమర్శలు గుప్పించిన కెసిఆర్ కూడా పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించి అదే తప్పు చేశారని చెప్పక తప్పదు. తెలంగాణాలో తన అధికారానికి, తన తెరాసకి ఎదురులేకుండా చేసుకొనేందుకు కెసిఆర్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలని తెరాసలోకి ఆకర్షించారు.

అది చాలా అప్రజాస్వామికమైన, అనైతికమైన పని అని అందరూ విమర్శిస్తుండటంతో కెసిఆర్ తన తన తప్పుని కప్పి పుచ్చుకొనేందుకు దానికి బంగారి తెలంగాణా సాధన కోసం “రాజకీయ పునరేకీకరణ” అనే అందమైన పేరు పెట్టారు. అది అయన తప్పుని కప్పి పుచ్చలేదు కానీ అయన మాటకారితనానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

తెదేపా ఎమ్మెల్యేలని కెసిఆర్ తెరాసలోకి ఫిరాయింపజేస్తునప్పుడు “వారందరినీ ఆయన సంతలో పశువులులాగ కొనుకొంటుంటే, వారు ఏ మాత్రం సిగ్గుశరం లేకుండా పశువుల్లా అమ్ముడుపోతున్నారు” అని చంద్రబాబు నాయుడు విమర్శించడం అందరికీ తెలుసు. కానీ ఆ తరువాత ఆయన కూడా అదే కారణంతో, అదే పద్దతిలో ఆంద్రాలో వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేసుకొన్నారు. అదీ చాలా పాత కధే.

ఇంతకీ విషయం ఏమిటంటే, గుంటూరులో నిన్న జరిగిన తెదేపా మేధోమధనం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ “80 శాతం రాజకీయ పునరేకీకరణ’ జరగాలని తన పార్టీ మంత్రులకి, ప్రజా ప్రతినిధులకి చెప్పారు. రాజకీయ పునరేకీకరణ అంటే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడమేనని మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.

అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వాలు, ప్రణాళికలు, లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం చూశాము కానీ ఫిరాయింపులకి..అదే..రాజకీయ పునరేకీకరణకి కూడా ఈవిధంగా టార్గెట్స్ పెట్టుకోవడం ఇదే మొదటిసారేమో?

తన ప్రేరణతో రాజకీయ పునరేకీకరణ ప్రక్రియ..అదే పార్టీ ఫిరాయింపులు కార్యక్రమం చేపట్టిన చంద్రబాబుని చూసి ఇప్పుడు కెసిఆర్ ప్రేరణ పొందుతారేమో? కనుక రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపాలు తస్మాత్ జాగ్రత్త! మిగిలిన ఎమ్మెల్యేలని కూడా 'రాజకీయ పునరేకీకరణ' చేసేసే ప్రమాదం కనబడుతోంది. ముందుగా డికె అరుణతో ఆ పని మొదలుపెడతారేమో?



Related Post