పాక్ వ్యూహం మార్చింది..భారత్ బయటపడగలదా?

October 06, 2016


img

సుమారు 3 నెలల క్రితం కాశ్మీర్ లో అల్లర్లతో మొదలైన పాక్ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. యూరీ దాడుల కారణంగా పాకిస్తాన్ పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగింది కనుక వెనక్కి తగ్గుతుందనుకొంటే ఇంకా పెట్రేగిపోతోంది. ఆరోజు నుంచే పాక్ ఉగ్రవాదులు భారత్ ఆర్మీ క్యాంపులని, సైనికులని లక్ష్యంగా చేసుకొని రోజూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం బారాముల్లా జిల్లాలోని హంద్వారా ఆర్మీ క్యాంప్ లోకి ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నం చేశారు. వారికీ, భద్రతాదళాలకి మధ్య సుమారు అర్ధగంటసేపు కాల్పులు జరిగాయి. వాటిలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా మిగిలిన వారు పారిపోయారు. వారికోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి. 

యూరీ ఘటన తరువాత రోజు నుంచి వరుసగా జరుగుతున్న ఈ గెరిల్లా తరహా దాడులు గమనిస్తే, పాక్ తన వ్యూహం మార్చినట్లు అర్ధం అవుతోంది. అయితే యూరీ దాడులతో సహా కాశ్మీర్ లో భారత సేనలపై జరుగుతున్న దాడులతో తనకి సంబంధం లేదని, అవి కాశ్మీర్ స్వాతంత్ర్య పోరాటాలుగా అభివర్ణిస్తూ పాక్ అతితెలివి ప్రదర్శిస్తోంది. ఈవిధంగా కాశ్మీర్ లో నిరంతరంగా యుద్దవాతావరణం సృష్టిస్తూ, కాశ్మీర్ వ్యవహారంలో ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవడం అనివార్యమయ్యేలా చేయాలని పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.

భారత్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి అక్కడ తిష్టవేసుకొన్న ఉగ్రవాదులని, వారి శిబిరాలని ద్వంసం చేయగలిగింది కానీ తమపై గెరిల్లా పద్దతిలో రోజూ దాడులు చేస్తున్న పాక్ ఉగ్రవాదులని ఎదుర్కోవడం వారికి చాలా కష్టమైపోతోంది. ఏమాత్రం ఆదమరిచి ఉన్నా పాక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. కనుక వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరంగా పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది లేకుంటే పాక్ ఉగ్రవాదుల చేతుల్లో మన సైనికులు చనిపోవడమే కాకుండా, పాక్ అమలుచేస్తున్న ఈ సరికొత్త వ్యూహం వలన కాశ్మీర్ రావణకాష్టంలాగ రగులుతూనే ఉంటుంది. తత్ఫలితంగా కేంద్రప్రభుత్వం ఎల్లప్పుడూ కాశ్మీర్ పైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉగ్రవాదులని, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆలోచించవలసివస్తే     దేశాభివృద్ధి గురించి ఆలోచించడానికి సమయం చిక్కదు. పాక్ పన్నిన ఈ పద్మవ్యూహం నుంచి భారత్ ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిది లేకుంటే దేశం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.  


Related Post