భారత్ ఆర్మీ చేసిన సర్జికల్ ఆపరేషన్ బాగా పనిచేసినట్లే ఉంది

October 05, 2016


img

భారత్, పాక్ మద్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో బుధవారం పాక్ పార్లమెంటు ఉభయసభలు అత్యవసర సమావేశం అయ్యాయి. 

పార్లమెంటు ఉభయస సభల సభ్యులని ఉద్దేశ్యించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ “కాశ్మీర్ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మనం చాలా కాలంగా భారత్ ని చర్చలకి ఆహ్వానిస్తూనే ఉన్నాము. కానీ భారత్ మాత్రం అంగీకరించడం లేదు. ఐక్యరాజ్యసమితి భారత్ పై చేయవలసిన అవసరం ఉంది,” అని అన్నారు. 

యూరీ దాడుల గురించి షరీఫ్ మాట్లాడుతూ “ఆ దాడులు జరిగిన వెంటనే భారత్ మన దేశమే అందుకు కారణని అసత్య ఆరోపణలు చేసింది. కానీ అందుకు సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది. దీనిని బట్టి మన దేశ ప్రతిష్టని దెబ్బ తీయడానికే భారత్ అసత్య ప్రచారం చేస్తోందని స్పష్టం అవుతోంది,” అని అన్నారు. 

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో చేసిన ప్రసంగంలో “దేశాలు యుద్దాలు చేయడం కాదు ఆకలి, పేదరికంపై యుద్ధం చేద్దామని” పాకిస్తాన్ కి పిలుపునిచ్చారు. దానిపై పాక్ ప్రధాని షరీఫ్ స్పందిస్తూ,” మేము ఎప్పుడూ శాంతినే కోరుకొంటాము. మోడీ కూడా నిజంగా శాంతినే కోరుకొంటున్నట్లయితే పంట పొలాల మీదుగా యుద్ద ట్యాంకర్లని నడిపించడం అది సాధ్యం కాదని గ్రహించాలి. మనం భారత్ తో యుద్ధం కోరుకోవడం లేదు కానీ మన ప్రమేయం లేకుండా అది వస్తే తప్పకుండా గట్టిగా బడులిస్తాము,” అని నవాజ్ షరీఫ్ అన్నారు.         

సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు పాక్ ప్రభుత్వం, సైన్యం అంగీకరించడం లేదు కనుక ఆరోజు సెప్టెంబర్ 28న సరిహద్దుల వద్ద కాల్పులు మాత్రమే జరిగాయని, అందులో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారని షరీఫ్ మళ్ళీ పాత పాటే పాడారు.

ఇదివరకు ‘భారత్ తో యుద్ధం..అణుబాంబులు’ అంటూ చాలా ప్రగల్భాలు పలికిన పాక్ వైఖరిలో చాలా మార్పు వచ్చినట్లు నవాజ్ షరీఫ్ ప్రసంగం వింటే అర్ధం అవుతుంది. బహుశః భారత్ ఆర్మీ చేసిన సర్జికల్ ఆపరేషన్ చాలా బాగా పనిచేసినట్లు భావించవలసి ఉంటుంది. 


Related Post