భారత్ కి ఇంటాబయటా శత్రువులే!

October 04, 2016


img

భారత్ కేవలం పాకిస్తాన్, దాని ఉగ్రవాదులతోనే కాదు..వారితో బాటు భారత్ లోని ప్రతిపక్ష రాజకీయ నాయకులతోనూ, బాలీవుడ్ నటులతో కూడా పోరాడవలసిరావడం చాలా దురదృష్టకరం. యూరీ దాడులు జరిగినప్పుడు సంతాపం వ్యక్తం చేసినవారు, భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ దాడులు నిర్వహించినప్పుడు జేజేలు పలికిన నోళ్ళతోనే ఇప్పుడు వాళ్ళని ఆర్మీలో ఎవరు చేరమన్నారు...ఉగ్రవాదుల చేతిలో ఎవరు చావమన్నారు..వారి చేతిలో చనిపోవడం వారి ఖర్మ..వారు అసమర్ధులు కనుకనే చచ్చారు...సర్జికల్ స్ట్రయిక్స్ దాడులు చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా?అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీర జవాన్ల త్యాగాలని, వారి శౌర్యపరాక్రమాలని అవమానిస్తున్నారు.

శత్రుదేశం సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని వితండవాదం చేస్తుంటే, భారత్ లో ప్రతిపక్ష రాజకీయ నాయకులు దానికి వంత పాడుతున్నారు. దేశ సార్వభౌమత్వానికి శత్రుదేశం సవాలు విసురుతుంటే అందరూ ఏకత్రాటిపై నిలిచి దానిని ఎదుర్కొంటున్న భారత సైనికులకి, భారత ప్రభుత్వానికి అండగా నిలబడకపోగా ఇటువంటి మాటలతో వారి ఆత్మవిశ్వాసాన్ని చాలా దారుణంగా దెబ్బ తీస్తున్నారు. భారత్ లో జరుగుతున్న ఈ వాదోపవాదాలని చూసి శత్రుదేశం కూడా అవహేళన చేసే పరిస్థితి కల్పిస్తున్నారు. 

భారత్ ప్రభుత్వం, భారత ఆర్మీ పట్ల ఈవిధంగా చులకనగా మాట్లాడున్నవారు ఎవరో అనామకులు, అజ్ఞానులు, మూర్ఖులు కారు. ఒకరు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరొకరు బాలీవుడ్ లో అందరి కంటే సీనియర్ నటుడు ఓం పూరి. మరొకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్, ఇంకొకరు బీహార్ లోని ఆర్.జె.డి.పార్టీ నేత. 

సాధారణ పరిస్థితులలో ఎవరు ఎన్ని రాజకీయాలు చేసుకొన్నా ప్రజలు కూడా పట్టించుకోరు. శత్రుదేశం యుద్దానికి కాలు దువ్వుతుంటే, దేశంలో అంతర్గతంగా ఇటువంటి వారి నుంచి కూడా భారత ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరంకాక మరేమిటి? సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన కారణంగా ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలో, ప్రపంచ దేశాలలో అనూహ్యంగా మద్దతు పెరిగిపోవడం చూసి జీర్ణించుకోలేక ఆయనని, భాజపాని వ్యతిరేకించే ప్రతిపక్ష రాజకీయ నేతలు సర్జికల్ స్ట్రయిక్స్ కి సాక్ష్యాధారాలు చూపించమని వితండవాదం చేస్తుంటే, సినిమాలలో గొప్ప పేరు, డబ్బు ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకొన్న నటులు మిడిమిడి జ్ఞానంతో తమ నోటికి వచ్చినట్లు ఆర్మీ జవాన్ల గురించి చులకనగా మాట్లాడుతుండటం చాలా దురదృష్టం. గమ్మతయిన విషయం ఏమిటంటే ఆర్మీ గురించి ఆవిధంగా చులకనగా మాట్లాడున్న నటులు ఏదో ఒక సినిమాలో దేశం కోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ ఆఫీసర్లుగా నటించినవారే.

ఇటువంటి వారికి చెప్పుతో కొట్టినట్లుగా బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ సమాధానం చెప్పారు. సినిమాలలో హీరోలుగా నటించేవారు నిజజీవితంలో డమ్మీలు మాత్రమేనని అటువంటి వారి మాటలని ప్రజలు, ప్రభుత్వం కూడా పట్టించుకోవలసిన అవసరంలేదని అన్నారు. ఆర్మీ జవాన్ల కష్టం, దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు ఏమిటో తనకి బాగా తెలుసునని అన్నారు.    



Related Post