పాకిస్తాన్ పట్ల భారత్ ఇంకా సందిగ్ధం దేనికి?

October 04, 2016


img

ప్రపంచదేశాలలో పాకిస్తాన్ని ఏకాకి చేయాలనే భారత్ చేస్తున్న ప్రయత్నాలకి క్రమంగా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. అమెరికా, ఇంగ్లాడ్ దేశాలలో అందుకు అనుకూలంగా పిటిషన్లు నమోదు చేయబడ్డాయి. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పడు రష్యన్ ఆర్మీ బృందం పాక్ ఆర్మీతో కలిసి సైనిక విన్యాసాలు చేయడం భారత్ జీర్ణించుకోవడం కష్టమే. ఆ పరిణామాన్ని సాకుగా చూపించి పాక్ పాలకులు తమకి రష్యా బహిరంగంగా మద్దతు ఇస్తోందని గొప్పలు చెప్పుకొన్నారు కూడా. కానీ భారత్ లో ఉగ్రవాదుల దాడులకి పాకిస్తానే కారణమని, తక్షణమే అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు మానుకోవాలని రష్యా తీవ్రంగా హెచ్చరిండంతో  పాక్ షాక్ తింది. పాకిస్తాన్ని గట్టిగా హెచ్చరించడమే కాదు అవసరమైతే తాము భారత్ కి అండగా నిలబడతామని రష్యా తేల్చి చెప్పింది కూడా. ఇది పాకిస్తాన్న్ కి ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. వచ్చేనెల ఇస్లామాబాద్ లో జరుగవలసిన సార్క్ సమావేశాలు రద్దయ్యేలా చేయడంతో పాకిస్తాన్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. 

అయితే పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి ఏకాకిని చేయాలని, ఆ దేశంపై ఆంక్షలు విదించాలని ప్రపంచ దేశాలని కోరుతున్న భారత్ నేటికీ పాకిస్తాన్ కి “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. భారత్ కి ఆ హోదా ఇవ్వడానికి పాకిస్తాన్ ఏనాడూ ఆలోచించలేదు కానీ పాక్ పాలకులని ప్రసన్నం చేసుకోవాలనే బలహీనత ఉన్న మన పాలకులు పాకిస్తాన్ కి ఆ హోదాని కట్టబెట్టారు. దానిని నేటికీ కొనసాగిస్తూనే ఉండటం మరీ విడ్డూరంగా ఉంది.

గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ భారత్ పై ప్రత్యక్ష, పరోక్ష యుద్దాలు చేస్తూనే ఉంది. తరచూ ఉగ్రవాదుల చేత దాడులు చేయిస్తూనే ఉంది. కనుక దానికి ఆ హోదాని ఎప్పుడో రద్దు చేసి ఉండాల్సింది. కనీసం పఠాన్ కోట్ పై దాడుల తరువాతైన రద్దు చేసి ఉండాల్సింది. కానీ నేటికీ పాకిస్తాన్ కి “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాని కొనసాగిస్తూనే ఉంది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందో తెలియదు. ఆ హోదాని రద్దు చేయడానికి క్రిందటి వారం ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ వారంలో దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా పాకిస్తాన్ కి ఆ హోదా రద్దు చేయకపోతే, ఏదో ఒకరోజున ప్రపంచ దేశాలు ఇదే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పుకోవడం కష్టం అవుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post