పాక్ ని ఉగ్రవాదదేశంగా ప్రకటించాలా?

October 03, 2016


img

పాకిస్తాన్ లో హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు బహిరంగంగా చాలా స్వేచ్చగా తిరుగుతుంటారు. పాక్ ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పిస్తూనే మరోపక్క ఉగ్రవాదంపై పోరుకోసం అంటూ అగ్రరాజ్యాల దగ్గర నుంచి ఏటా కోట్లు రూపాయాలు దండుకొంటుంది. వాటికి ఆ సంగతి తెలిసి ఉండి కూడా ఏటా పాకిస్తాన్ కి కప్పం (పన్ను) చెల్లించినట్లుగా కోట్లాది రూపాయలు, అత్యాధునిక ఆయుధాలు సమర్పించుకొంటాయి. అంటే పాకిస్తాన్ తమతో డబుల్ గేమ్ ఆడుతోందని భావిస్తున్న అగ్రరాజ్యాలు కూడా అదే పని చేస్తున్నట్లే కదా? కనుక అవి ఉగ్రవాద నిర్మూలనకే పాకిస్తాన్ కి నిధులు, ఆయుధాలు అందిస్తున్నట్లుగా భావించలేము. వాటి వెనుక ఇతర కారణాలు చాలా ఉండవచ్చు. ఉగ్రవాద నిర్మూలన అనేది వాటికి ఒక అందమైన ముసుగు మాత్రమే. 

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల ద్వారా ప్రపంచ దేశాల, ముఖ్యంగా అగ్ర రాజ్యాల ఆలోచనలని ప్రభావితం చేయడం వలన ఇప్పుడవి ఆ ముసుగుని తొలగించుకొని యూరీ దాడులని ఖండించడమే కాకుండా, పాక్ చర్యలకి ఉపక్రమిస్తున్నాయి. అవైనా నిజమైనవో లేక భారత్ ని మభ్యపెట్టడానికే చేస్తున్నావో వాటి నిబద్దతని బట్టి రానున్న రోజుల్లో తెలుస్తుంది.

పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలైంది. దానికి మద్దతుగా కేవలం ఒక లక్ష మంది సంతకాలు చేస్తే సరిపోతుంది. కానీ అది ప్రవేశపెట్టిన కొన్ని రోజులలోనే సుమారు నాలుగున్నర లక్షల మంది సంతకాలు చేశారు. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటులో కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలవడం విశేషం. దీనిని బట్టి అగ్రరాజ్యాల ఆలోచనలని ప్రధాని నరేంద్ర మోడీ చాలా ప్రభావితం చేయగలిగారని స్పష్టం అవుతోంది. 

అమెరికా పిటిషన్ కి భారతీయులతో సహా అనేకదేశాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. రెండు అగ్రరాజ్యాలు పాక్ పట్ల బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నాయి కనుక వాటిని చూసి మిగిలిన అగ్రరాజ్యాలు, చిన్నా పెద్దా దేశాలు కూడా వాటితో చేతులు కలిపి పాకిస్తాన్ని నియంత్రించవచ్చు. 

భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన తరువాత ఉలిక్కిపడిన పాకిస్తాన్ మళ్ళీ తీరుకొని యధాప్రకారం సరిహద్దుల వద్ద భారత్ పోస్టులపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆ దాడులలో భారత్ సైనికులు చాలా బారీగా చనిపోయారని కానీ భారత్ ఆ విషయాన్నీ దాచిపెడుతోందని పాక్ పాలకులు, సైన్యాధికారులు గట్టిగా వాదిస్తున్నారు. దాని వాదనలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, నేటికీ తమ తీరు ఏమాత్రం మారలేదని పాక్ స్వయంగా దృవీకరిస్తున్నట్లే అర్ధమవుతోంది. అసలైన సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏవిధంగా ఎంత భయానకంగా ఉంటాయో భారత్ కి త్వరలోనే రుచి చూపిస్తానని ఉగ్రవాది హఫీజ్ సయీద్ మొన్ననే బహిరంగంగా పాకిస్తాన్ గడ్డపై నిలబడి ప్రకటించాడు. కనుక పాకిస్తాన్ ఇంకా బరి తెగించక ముందే దానిని అందరూ కలిసి కట్టడి చేయవలసి ఉంది. కనుక బ్రిటన్ పిటిషన్ కి కూడా అందరూ మద్దతు తెలుపడం చాలా అవసరమే. కానీ దీనికి కేవలం బ్రిటన్ పౌరులు లేదా బ్రిటన్ లో నివసిస్తున్న వారు మాత్రమే మద్దతు తెలుపడానికి వీలుంది. కనుక బ్రిటన్ లో స్థిరపడిన భారతీయులు ఈ పిటిషన్ కి మద్దతు తెలుపవచ్చు. ఈ పిటిషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు: https://petition.parliament.uk/petitions/168107


Related Post