భారత్ హెచ్చరికలు బేఖాతర్..అందుకే ఎదురుదెబ్బ

September 30, 2016


img

భారత్ సైనికులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి ఉగ్రవాదులని, వాళ్ళ స్థావరాలని నాశనం చేసి రావడంతో యావత్ భారతీయులు చాలా సంతోషిస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకొంటున్నారు. ఇంతకాలం తరువాత పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పగలిగినందుకు అందరూ ప్రధాని నరేంద్ర మోడీని, అటువంటి సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినందుకు భారత సైనికులని మెచ్చుకొంటున్నారు. భారతీయుల ఈ సంబరాలు, ఈ సంతోషం చూస్తుంటే ఇన్నేళ్ళుగా పాక్ దుశ్చర్యల పట్ల వారు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధం అవుతోంది.  

యూరీ ఉగ్రదాదుల తరువాత “మేము అనుకొన్న సమయంలో, కోరుకొన్న ప్రాంతంలో లక్షిత దాడులు చేస్తామని భారత్ చూచాయగా చేసిన హెచ్చరికలని పాకిస్తాన్ చలా తేలికగా తీసుకొంది. ఎందుకంటే భారత్ పాలకులు తరచూ ఇటువంటి సమయంలో అటువంటి పడికట్టు పదాలు వల్లె వేస్తూనే ఉండటమే బహుశః అందుకు కారణం కావచ్చు. కానీ కొన్ని నెలల క్రితం భారత్ సైనికులు మయన్మార్ భూభాగంలోకి ప్రవేశించి ఈవిధంగానే ‘సర్జికల్ స్ట్రయిక్’ చేసిన సంగతిని పాక్ పాలకులు, సైన్యాధికారులు విస్మరించడం విడ్డూరంగా ఉంది. అప్పుడే వారు మోడీ గురించి వారికి ఒక అవగాహన ఏర్పడి ఉండాలి. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ “భారత్ మా భూభాగంలో కాలు పెడితే భారత్ ని అణుబాంబులతో ద్వంసం చేస్తామని హెచ్చరించారు. పాక్ పాలకులు, సైన్యాధికారులు అణ్వాయుధాల ప్రస్తావన చేసి భారత్ ని భయపెట్టాలనుకోవడం భారత్ ని బ్లాక్ మెయిల్ చేయడంగానే చెప్పవచ్చు. అటువంటి బ్లాక్ మెయిలింగ్ కి ఏమాత్రం లొంగబోమని భారత్ నిరూపించి చూపించింది. 


Related Post