రైతుల ఆలోచన అందరికీ ప్రమాదకరమే కదా!

January 23, 2021


img

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత మూడు నెలలుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరుగబోయే పరేడ్‌లో తాము ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. ఇది కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించకుండా ఆదేశించాలని కోరుతూ కేంద్రం పిటిషన్‌ వేయగా సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. దానిపై ఢిల్లీ పోలీసులు తగిన చర్య తీసుకొంటారని చెపుతూ ఈ సమస్యను వారి మెళ్ళో వేయడంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తలలు పట్టుకొన్నారు. 

ఏటా గణతంత్రదినోత్సవ వేడుకలలో పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేయడానికి కుట్రలు పన్నుతుంటారు. వారిపై కన్నేసి ఉంచే నిఘావర్గాలు ఎప్పటికప్పుడు వారిని అడ్డుకొంటుంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఢిల్లీలో వేలాదిమంది రైతులు ఆందోళనలు చేస్తుండటం, వారు పరేడ్‌లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడానికి సిద్దమవుతుండటంతో చాలా ప్రమాదకరంగా ఉంది. 

ఢిల్లీ సింఘూ వద్ద ఆందోళనలు చేస్తున్న రైతులు శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఓ అపరిచిత వ్యక్తిని పట్టుకున్నారు. తమ గుడారాలకు నిప్పు పెట్టేందుకు వచ్చాడని అతను చెప్పాడని రైతులు చెప్పారు. తమ ట్రాక్టర్స్ ర్యాలీని అడ్డుకొనేందుకు ఢిల్లీ పోలీసులే అతనిని పంపించి ఉంటారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదేవిదంగా పాక్‌ ఉగ్రవాదులు మారువేషాలలో రైతులలో కలిసిపోయి విధ్వంసం సృష్టించినా లేదా వారి ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని పరేడ్‌కు వచ్చిన ప్రముఖులు, ప్రజలపై దాడులు చేసినా ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు. కనుక ఈ సమయంలో రైతులు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించడం, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలనుకోవడం వారికే కాక అందరికీ ప్రమాదకరమేనని చెప్పక తప్పదు. కనుక కేంద్రప్రభుత్వం, రైతులు, ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.


Related Post