కాబోయే సిఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్: పద్మారావుగౌడ్

January 22, 2021


img

మంత్రి కేటీఆర్ గురువారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘం భవనాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ కేటీఆర్‌ ప్రారంభోత్సవం కంటే మరో విశేషం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్ మాట్లాడుతూ, “త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్న కేటీఆర్‌కు ముందే శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ముఖ్యమంత్రి కాగానే సికింద్రాబాద్‌లోని రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి ఏ ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

పద్మారావు మాటలకు మంత్రి కేటీఆర్‌ చిర్నవ్వుతో సమాధానం చెప్పి తప్పించుకున్నారు తప్ప ‘కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్’ కు బదులివ్వలేదు. ఒకవేళ పొరపాటున ‘థాంక్స్’ అని ఉంటే తాను ముఖ్యమంత్రి కాబోతున్నట్లు స్వయంగా దృవీకరించినట్లయ్యేది. మీడియా కూడా ఆ ‘థాంక్స్’ పదాన్ని పట్టుకొని మిగతా కధ అల్లేసి ఉండేది. కానీ మంత్రి కేటీఆర్‌ లౌక్యం తెలిసిన నాయకుడు కనుక చిర్నవ్వుతో అవుననకుండా కాదనకుండా తప్పించుకున్నారు. 

ఇప్పటికే టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిత్యం ‘త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ..’పాట పాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. సాధారణంగా ఈ మాసంలో ఎటువంటి శుభకార్యక్రమాలు చేయరు కనుక రాజకీయాలకు కూడా అది వర్తిస్తుంది. యాదాద్రి ఆలయం నిర్మాణపనులు పూర్తవగానే దాని సిఎం కేసీఆర్‌ సుదర్శనయాగం చేస్తానని గత ఏడాదే ప్రకటించారు. ఫిబ్రవరి 11తో పుష్యమాసం ముగిసి 12 నుంచి  మాఘమాసం మొదలవుతుంది. కనుక అప్పుడు సిఎం కేసీఆర్‌ సుదర్శనయాగం చేసి ఆ తరువాత మంచిరోజు చూసుకొని కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలున్నాయి. ఈసారైనా సిఎం కేసీఆర్‌ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.


Related Post