కరోనాలాగే బర్డ్ ఫ్లూను కూడా లైట్ తీసుకొంటే...

January 21, 2021


img

నల్గొండ జిల్లా నార్కాట్‌పల్లి మండలం ఏనుగుల దోరి గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు చనిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒకేసారి అన్ని కోళ్ళు చనిపోవడంతో అనుమానం రేకెత్తిస్తుంది.

బర్డ్ ఫ్లూ సోకి కోళ్ళు చనిపోయి ఉండవచ్చనే అనుమానంతో కోళ్ల ఫామ్ యజమాని పి.మహేందర్ రెడ్డి వెంటనే నల్గొండ పశుసంవర్ధక శాఖకు ఈ విషయం తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ అధికారులు వచ్చి పరిశీలించిన తరువాత అక్కడి వాటర్ ట్యాంక్‌లో విషపూరితమైన రసాయనాల అవశేషాలు లభించినట్లు తెలిపారు. విషపూరితమైన నీళ్ళు త్రాగడం వలననే కోళ్ళు చనిపోయాయి తప్ప బర్డ్ ఫ్లూ వలన కాదని అధికారులు తేల్చిచెప్పారు. 

కానీ స్థానికులు కోళ్ళు చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సంబంధిత అధికారులను, నిపుణులను పంపించి మరింత లోతుగా పరిశీలించాలని కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ అనుమానంతో ప్రజలు చికెన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో కోళ్ళ ఫారం యజమానులు, చికెన్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే కోళ్ళు చనిపోవడంపై లోతుగా పరీక్షలు జరిపించి ప్రజల అనుమానాలను తొలగించాల్సి ఉంది.

గతంలో కరోనా మహమ్మారి రాష్ట్రంలో ప్రవేశించి మెల్లగా విజృంభిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం తేలికగానే తీసుకుంది. వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందని ఒకరు, కషాయం తాగితే పోతుందని మరొకరు, పారసిటమాల్ మాత్ర వేసుకొంటే సరిపోతుందని సాక్షాత్ సిఎం కేసీఆర్‌... ఇలా పలు సందర్భాలలో కరోనా గురించి మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలా తేలికగా మాట్లాడారు. కానీ ఆ తరువాత కరోనా విజృంభించి ఎన్ని సమస్యలను సృష్టించిందో అందరూ స్వయంగా చూశారు...నేటికీ కరోనా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. కనుక కరోనా నేర్పిన ఆ గుణపాఠాలను ప్రభుత్వం గుర్తుంచుకొని రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా నిరోదించేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే బర్డ్ ఫ్లూ కూడా రాష్ట్రంలో వ్యాపిస్తే ఊహించని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


Related Post