త్వరలో కేటీఆర్‌ సిఎం కానున్నారు: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు

January 21, 2021


img

కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ మళ్ళీ టిఆర్ఎస్‌ పార్టీ నేతలు కోరస్ పాడటం మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైరా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్, నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు.

“మంత్రి కేటీఆర్‌ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు కనుక మాకు ఎవరితోనూ పోటీ లేదు. పార్టీలో చిన్న చిన్న అంతర్గ విభేధాలున్నమాట వాస్తవం. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతాం,” అని రాములు నాయక్ అన్నారు. 

 “వచ్చే శాసనసభ సమావేశాలలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక. అయితే అంతకంటే ముందుగానే...త్వరలోనే సిఎం కేసీఆర్‌ తన పదవిని కేటీఆర్‌కు అప్పగిస్తారని భావిస్తున్నాను. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని పార్టీలో యువనేతలందరూ కోరుకొంటున్నారు,” అని అన్నారు.

నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం డిచ్‌పల్లి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “పార్టీలో ఎమ్మెల్యేలందరూ కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారు,” అని అన్నారు. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఈవిధంగా మాట్లాడటం పెద్ద విచిత్రమేమీ కాదు కానీ సిఎం కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం విశేషం. 

సిఎం కేసీఆర్‌ మొన్న మేడిగడ్డ బ్యారేజిలో గోదావరి జలాలకు పూజలు చేసి పూలు సమర్పించడంపై బండి సంజయ్‌ స్పందిస్తూ, “సిఎం కేసీఆర్‌ త్వరలో తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా దోషనివారణకు తన ఫాంహౌసులో పూజలు చేయించారు. వాటిలో ఉపయోగించిన పూజాసామాగ్రినే మేడిగడ్డలో కలిపారు. సిఎం కేసీఆర్‌ చేస్తున్న పూజలు, యాగాలు తన కుమారుడికి పట్టాభిషేకం చేయడం కోసమే తప్ప రాష్ట్రం... ప్రజల కోసం కాదు,” అని అన్నారు. బండి సంజయ్‌ విమర్శలు చేసినప్పటికీ ఆయన కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్పష్టం అవుతోంది. 

కేటీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలంటే పార్టీలోను, ప్రభుత్వంలోనూ అభ్యంతరాలు చెప్పేవారు... సిఎం కేసీఆర్‌ను అడ్డుకొనేవారు ఉండరనే చెప్పవచ్చు. కనుక అటువంటి ఆలోచనే ఉంటే ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేత ఈవిధంగా కోరస్ పాడవలసిన అవసరమే లేదు. కానీ పాడుతున్నారంటే అర్ధం పార్టీలో ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలుసుకొని వారిని చల్లబరచడం కోసమేనేమో... అని అనుకోవలసి ఉంటుంది.


Related Post