వాషింగ్‌టన్‌లో అత్యవసర పరిస్థితి విధించిన ట్రంప్

January 13, 2021


img

ఈనెల 20వ తేదీన జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులు వాషింగ్‌టన్‌తో సహా దేశవ్యాప్తంగా ఆందోళనల పేరిట అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకు సిద్దం అవుతున్నారని ఎఫ్.బి.ఐ హెచ్చరించడంతో స్వయంగా డోనాల్డ్ ట్రంప్‌ రంగంలో దిగి అత్యవసర పరిస్థితి విధించవలసి వచ్చింది. 

జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు వాషింగ్‌టన్‌లో ఈనెల 24వరకు అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) విధిస్తున్నట్లు వైట్‌హౌస్‌ అధికారులు ప్రకటించారు. వాషింగ్‌టన్‌లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి అన్ని విధాలా సహకరించేందుకు డోనాల్డ్ ట్రంప్‌ అంగీకరించారని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. వాషింగ్‌టన్‌లో అదనపు సాయుధ బలగాలను మోహరించారు. ముఖ్యంగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయబోయే క్యాపిటల్ హిల్ భవనం పరిసర ప్రాంతాలలో భారీగా సాయుధ దళాలను మోహరించారు. 

అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం అంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ అధ్యక్ష ఎన్నికలలో తనను ఓడించి గద్దె దించినందుకు జో బైడెన్‌కు ఈ సంతోషం కూడా లేకుండా చేద్దామనే దురుదేశ్యంతోనే ట్రంప్‌ తన మద్దతుదారులను రెచ్చగొట్టి ఉండవచ్చు. కనుక పండుగలా ప్రజల మద్య ఎంతో సంతోషంగా జరుగవలసిన జో బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవం పోలీసులు, సాయుధ దళాల పహారా మద్య చేయవలసివస్తోంది. ఇందుకు ట్రంప్‌ మూల్యం చెల్లించకుండా తప్పించుకోవడం కష్టమే. అమెరికన్ కాంగ్రెస్‌లో ఆయనను అభిశంశిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై నేడు ఓటింగ్ జరుగనుంది. దానికి ఉభయసభలు ఆమోదం తెలిపితే వారం రోజుల ముందుగానే డోనాల్డ్ ట్రంప్‌ తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవలసి ఉంటుంది. సర్వశక్తివంతుడైన  అమెరికా అధ్యక్షుడు ఇటువంటి అవమానకర పరిస్థితులలో నిష్క్రమించవలసివస్తే అది ఆయనకే సిగ్గుచేటు...అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తూ అమెరికా ప్రతిష్టకు కూడా మచ్చ తెచ్చారు.


Related Post