టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు సాగర్ అగ్నిపరీక్ష

January 12, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికలు రాష్ట్రంలోని అధికార టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు అగ్నిపరీక్షగా చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఈ ఎన్నికలు జరుగుతున్నందున టిఆర్ఎస్‌ సాగర్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలంటే మళ్ళీ గెలిచి తీరాలి. అదీగాక దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో బిజెపిలో చేతిలో ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ తప్పక గెలిచితీరాలి లేకుంటే ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా తప్పుడు సంకేతాలు వెళతాయి. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో దిగుతుండటంతో టిఆర్ఎస్‌ మరింత చమటోడ్చక తప్పకపోవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు అగ్నిపరీక్షవంటివే అని చెప్పవచ్చు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా బలహీనంగా ఉందని అందరికీ తెలుసు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరిగిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా కొట్టుకుపోయింది. కనుక రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ తప్పక గెలిచి తీరాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొంటున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. కనుక ఇవి ఆయనకు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని చెప్పవచ్చు. కానీ ఒకవైపు అన్నివిధాల సర్వ శక్తివంతమైన అధికార టిఆర్ఎస్‌ను, మరోవైపు వరుస విజయాలతో సమరోత్సాహంతో ఉరకలువేస్తున్న బిజెపిని ఆయన ఎదుర్కొని ఓడించవలసి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే బహుశః రాజకీయ సన్యాసం స్వీకరించవచ్చు కనుక ఈ ఉపఎన్నికలు జానారెడ్డికి అగ్నిపరీక్షవంటివే అని చెప్పక తప్పదు.

ఈ ఉపఎన్నికలలో కూడా తప్పకుండా గెలవాలని బిజెపి ఉవ్విళ్ళూరుతోంది. గెలిస్తే ఇక దానికి తిరుగు ఉండదు. ఒకవేళ ఓడిపోయినా ఆ పార్టీపై కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లపై పడినంత తీవ్ర ప్రభావం ఉండదు కనుక బిజెపికి రాష్ట్రంలో తన సత్తా చాటుకొనేందుకు ఇవి మరో అవకాశం కల్పిస్తున్న ఎన్నికలు మాత్రమే అని భావించవచ్చు. మరి నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.


Related Post