ఉత్తమ్‌ మళ్ళీ పాత పాటే...అయితే మళ్ళీ అవే ఫలితాలా?

January 09, 2021


img

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్దం అవుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సీనియర్ నేత కె.జానారెడ్డి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఆ ఉపఎన్నికలు ముగిసే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డే పిసిసి అధ్యక్షుడుగా కొనసాగబోతున్నారు. కనుక ఆయన సాగర్ ఉపఎన్నికల కోసం ప్రత్యేకమైన వ్యూహం ఏమైనా సిద్దం చేస్తున్నారా...అంటే ఆయన మాటలు విన్నట్లయితే లేదనే అనిపిస్తుంది.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. టిఆర్ఎస్‌, బిజెపిలు గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ చేస్తూ రహస్య అవగాహనతో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి ఖాయం. బిజెపికి డిపాజిట్ కూడా రాదు,” అని అన్నారు. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ నేతలు ఇవే ఆరోపణలు చేశారు. కానీ ప్రజలు టిఆర్ఎస్‌, బిజెపిలనే గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోలేదు. అంటే వాటి మద్య రహస్య అవగాహన ఉందా లేదా అనేది ప్రజలకు ఆసక్తి లేదని అర్ధమవుతోంది. అసలు టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్య సాగవలసిన పోటీ టిఆర్ఎస్‌-బిజెపిలకు ఏవిధంగా మారిందని కాంగ్రెస్‌ నేతలు ఆలోచించారో లేదో తెలీదు. ఈ వ్యూహానికి ప్రతివ్యూహం సిద్దం చేసుకోకుండా    కాంగ్రెస్ పార్టీ సాగర్ ఉపఎన్నికలకు వెళితే మళ్ళీ అవే చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. 


Related Post