మా అక్క ఉగ్రవాది కాదు: భూమా మౌనిక

January 09, 2021


img

సిఎం కేసీఆర్‌ బందువుల కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి, జైల్లో వేసి ఎఫ్.ఐ.ర్‌లో ఏ-1 నిందితురాలిగా పేర్కొనడంపై ఆమె సోదరి భూమా మౌనిక చాలా తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “చనిపోయిన మా తల్లితండ్రులు ఒకప్పుడు యావత్ సమైక్య ఆంద్రరాష్ట్రానికి సేవ చేశారు. వారు ఆళ్ళగడ్డకో... కర్నూలుకో పరిమితమైన నేతలు కారు. ఈ భూవివాదం దశాబ్ధాలుగా నాలుగుతోంది. ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దానిపై నేటికీ అనేక వివాదాలు ఉన్నాయి. ఆ భూవివాదంపై ఏదైనా నిర్ణయించవలసింది న్యాయస్థానాలే కానీ పోలీసులు కాదు. కానీ పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మా అక్క నేరస్థురాలన్నట్లు అరెస్ట్ చేసి ఏ-1 నిందితురాలిగా పేర్కొని జైల్లో వేశారు. నా సోదరి అఖిలప్రియ ఏపీ మాజీ మంత్రి. ప్రస్తుతం గర్భవతి కూడా. కానీ ఆమెను ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు జైల్లో పెట్టి మానసికంగా శారీరికంగా హింసిస్తున్నారు. మా అక్కకు ప్రాణహాని ఉంది మా కుటుంబానికి అటు ఏపీలోనూ రక్షణ లేదు ఇక్కడ హైదరాబాద్‌లోనూ లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే మేము మన దేశంలోనే ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. ఒక మహిళ పట్ల ప్రభుత్వం, పోలీసులు ఇంత అమానుషంగా వ్యవహరించడం చాలా బాధాకరం,” అని అన్నారు.


Related Post