జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా... కాషాయ జెండా?

December 04, 2020


img

జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్‌లు ఉన్నందున మేయర్ పదవి దక్కించుకోవాలంటే కనీసం 76 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఏ పార్టీకి అన్ని సీట్లు రాకపోతే అప్పుడు ఎక్స్‌ అఫీషియో ఓట్లను వినియోగించుకోవచ్చు. టిఆర్ఎస్‌కు గ్రేటర్ పరిధిలో 14 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నందున 28 ఎక్స్‌ అఫీషియో ఓట్లున్నాయి. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ తన ఓటును హైదరాబాద్‌కు బదిలీ చేయించుకొన్నందున ఆమె కూడా ఎక్స్‌అఫీషియో ఓటు వేయవచ్చు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఒకవేళ అంతకంటే తక్కువ వచ్చినా 29 ఎక్స్‌అఫీషియో ఓట్లను వినియోగించుకొని మేయర్ పదవిని దక్కించుకోవడం ఖాయం.        

ఈ ఎన్నికలలో మజ్లీస్‌ పార్టీ సుమారు 41 డివిజన్‌లు గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎన్నికలలో టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకొన్నప్పటికీ, మళ్ళీ ఇప్పుడు ‘భాయ్-భాయ్’ అయిపోతాయి కనుక అత్యవసరమైతే మజ్లీస్‌ కార్పొరేటర్ల మద్దతు కూడా లభిస్తుంది. మజ్లీస్‌కు 10 మంది ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయి. 

ఈ ఎన్నికలలో బిజెపికి 25-38 డివిజన్‌లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదే నిజమైతే బిజెపికి ఉన్న మూడు ఎక్స్‌అఫీషియో ఓట్లు వలన ఏ ప్రయోజనం ఉండదు. బిజెపి మేయర్ పదవి దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 76 డివిజన్‌లు గెలుచుకొంటేనే సాధ్యం. మరో 2-3 గంటలో ఎలాగూ ఫలితాలు వెలువడనున్నాయి కనుక జీహెచ్‌ఎంసీపై ఈసారి గులాబీ, కాషాయ జెండాలలో ఏది ఎగురుతుందో తేలిపోతుంది. 


Related Post