ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌ పర్యటన

November 28, 2020


img

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయబోతున్న మూడు ఫార్మా కంపెనీలను ప్రధాని నరేంద్రమోడీ నేడు సందర్శించనున్నారు. ఆయా కంపెనీల యాజమాన్యాలతో, శాస్త్రవేత్తలతో స్వయంగా మాట్లాడి వాటి పురోగతి గురించి తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేడు ఈ పర్యటన పెట్టుకొన్నారు. 

ముందుగా ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా 20 కిమీ దూరంలో ఉన్న చంగోదర్‌లోని జైడస్ క్యాడిలా కంపెనీకి ఉదయం 9.30 గంటలకు చేరుకొంటారు. ఆ సంస్థ దేశీయంగా తయారుచేస్తున్న జైకొవ్-డ్‌ వ్యాక్సిన్‌కు రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. వాటి పురోగతి, ఫలితాలు, అవి ఎప్పటికి పూర్తవుతాయనే విషయాల గురించి తెలుసుకొంటారు.

ఆ తరువాత అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పూణె చేరుకొంటారు. అక్కడ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయబోతున్న ‘కోవీషీల్డ్’ వ్యాక్సిన్‌ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్న తీరు, వాటి ఫలితాలు, ఎప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందనే విషయాలు అడిగి తెలుసుకొంటారు. 

ఆ తరువాత పూణె నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయానికి చేరుకొంటారు.         మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు హైదరాబాద్‌ శివార్లలో గల జీనోమ్ వ్యాలీలోని భారత్‌ బయోటెక్ కంపెనీకి ప్రధాని నరేంద్రమోడీ చేరుకొంటారు. ఆ కంపెనీ దేశీయంగా తయారుచేసిన ‘కోవాక్సిన్’ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ పురోగతి, ఫలితాల గురించి అడిగి తెలుసుకొంటారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగివెళతారు.

ప్రధాని నరేంద్రమోడీ ఒకే రోజున మూడు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయబోతున్న మూడు కంపెనీలను సందర్శిస్తుండటంతో ఈ పర్యటన తరువాత వ్యాక్సిన్‌ గురించి ఏదైనా ముఖ్య ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Related Post