సింహం సింగిల్‌గానే వస్తుంది: కేటీఆర్‌

November 27, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం చేసేందుకు ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వస్తున్న బిజెపి నేతలను, కేంద్రమంత్రులను ఉద్దేశ్యించి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రజనీకాంత్ పాపులర్ డైలాగ్ వాడారు. అల్వాల్ లయోలా కళాశాల రోడ్డు, యాప్రాల్ అంబేడ్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు ఒక్క కేంద్రమంత్రి ఇటువైపు తొంగి చూడలేదు. కానీ ఇప్పుడు డజనుకు పైగా కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, బిజెపి నేతలు నగరానికి రాబోతున్నట్లు విన్నాను. కానీ వారినందరినీ సిఎం కేసీఆర్‌ ఒక్కరే సింహంలా సింగిల్‌గా ఎదుర్కొంటున్నారు,” అని అన్నారు. కేటీఆర్‌ ఈ పాపులర్ డైలాగ్‌లో మిగిలిన సగం కూడా చెప్పి ఉంటే రచ్చరచ్చ అయ్యుండేది. 

డిల్లీ నుంచి నగరానికి వస్తున్న పోలిటికల్ టూరిస్టుల వల్లెవేసే చిలకపలుకులను విని నగర ప్రజలెవరూ గందరగోళానికి గురికావద్దన్నారు కేటీఆర్‌. వారికి హైదరాబాద్‌ నగరంలో ఉన్న సమస్యల గురించి, గత ఆరేళ్ళుగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు వ్రాసి ఇచ్చినదే వారు ప్రజల ముందు వల్లెవేసి ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారని వారివలన నగరానికి, రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. అయినప్పటికీ నగరానికి వచ్చే బిజెపి పెద్దలు కేంద్రం నుంచి వరదసాయం, పునరావాసం కోసం సిఎం కేసీఆర్‌ అడిగిన రూ.1,350 కోట్లు తీసుకువస్తే చాలా సంతోషిస్తామన్నారు కేటీఆర్‌. రాష్ట్ర బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న నగరంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. నగరం ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని, అప్పుడే యువతకు ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు వస్తాయని కనుక రాష్ట్ర బిజెపి నేతల మాటలను కూడా పట్టించుకోవద్దని మంత్రి కేటీఆర్‌ యువతకు విజ్ఞప్తి చేసారు.


Related Post