పాతబస్తీలో విద్యుత్ బిల్లులు చెల్లించక్కరలేదు: మజ్లీస్

November 27, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్‌, బిజెపిలకు సమానంగా దూసుకుపోతున్న మజ్లీస్‌ పార్టీ కూడా చాలా ధీటుగా స్పందిస్తుండటం తెలిసిందే. అయితే ఆ పార్టీ నేతల అత్యుత్సాహం మజ్లీస్‌ పార్టీకి, దానితో అనుబందం ఉన్న టిఆర్ఎస్‌కు కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మజ్లీస్‌ నేతల మాటలు బిజెపి ఆరోపణలను దృవీకరిస్తున్నట్లుండటంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం వారిని ప్రశ్నించలేని అలాగని సమర్ధించుకోలేని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మజ్లీస్‌ నేతల మాటలు బిజెపికి అనుకూలంగా మారుతుండటం టిఆర్ఎస్‌కు ఆందోళన కలిగించే విషయమే. 

తాజాగా బహదూర్ పురా మజ్లీస్‌ ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పాతబస్తీలో ఎవరూ విద్యుత్ బిల్లులు, మంచినీటి బిల్లులు చెల్లించనవసరం లేదు. అసలు మనల్ని బిల్లులు చెల్లించమని అడిగే ధైర్యం ఎవరికుంది?” అని అన్నారు. 

కిషన్ బాగ్ మజ్లీస్ అభ్యర్ధి హుస్సేనీ పాషా గురువారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “ఇక్కడ కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి ఇతరపార్టీలకు పనిచేస్తున్నారు. డిసెంబర్‌ 1వ తేదీ తరువాత వారికి మా తడాఖా చూపిస్తాము. వాళ్ళిక్కడ ఎన్ని దశాబ్ధాలుగా ఉన్నప్పటికీ ఇకపై వారిని ఈ గల్లీలలో తిరుగనీయకుండా మజ్లీస్‌ కార్యకర్తలు తరిమితరిమికొడతారు. రాబోయే 5 ఏళ్ళు మాదే అధికారం. మేమే పరిపాలిస్తాం,” అంటూ హెచ్చరించారు.   

మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీకి ఓ ముఖ్యమంత్రిలాగ వ్యవహరిస్తున్నారని, ఆయన అనుమతి లేనిదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పాతబస్తీలో అడుగుపెట్టలేరని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ఆరోపణలను మజ్లీస్‌ నేతల మాటలు దృవీకరిస్తున్నట్లున్నాయి. కనుక సహజంగానే బిజెపి వారి మాటలను తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మజ్లీస్‌ నేతలు ఎంతగా రెచ్చిపోతే అంతగా ఆ పార్టీకి, బిజెపికి కూడా లబ్దిపొందుతాయి. ఆ మేరకు టిఆర్ఎస్‌ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.


Related Post