ఇంతకీ విజయశాంతి ఏ పార్టీలో ఉన్నారో?

November 27, 2020


img

కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ పార్టీ ‘ప్రచారకమిటీ ఛైర్మన్‌గా పర్సన్’ పదవిలో ఉన్న ఆమె పార్టీకి ఎంతో కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రచారానికి రావడం లేదు. ఆమె పార్టీ ప్రచారానికి ఎందుకు రావడంలేదో ఇంతవరకు కాంగ్రెస్‌ నేతలు చెప్పలేదు. ఆమె కూడా చెప్పడం లేదు. ప్రచారానికి రాకపోయినా కనీసం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఒక్క మెసేజ్ పెట్టలేదు. అసలు తన సందేశాలలో ఎక్కడా పొరపాటున కూడా ‘కాంగ్రెస్‌’ అనే పదమే వాడకుండా చాలా జాగ్రత్తగా వ్రాస్తున్నారు. ‘టిఆర్ఎస్‌ను ఎదుర్కొంటున్న బలమైన ప్రత్యర్ధి’ అని వ్రాస్తున్నారే తప్ప బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీ అని వ్రాయకపోవడమే ఇందుకు తాజా నిదర్శనం. 

పైగా ఆమె బిజెపిలో చేరబోతున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను బలపరుస్తున్నట్లు, బిజెపి పేరు ప్రస్తావించకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆ పార్టీకి అనుకూలంగా లేదా మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. ‘సర్జికల్ స్ట్రయిక్స్ గురించి టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు ఎందుకు ఆగమగమవుతున్నాయి?’ అని ప్రశ్నించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆమె సిఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలు, సందిస్తున్న ప్రశ్నలు అన్నీ కూడా కాంగ్రెస్‌ తరపున కాక బిజెపి తరపునే అడుగుతున్నట్లున్నాయి. 

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి అత్యవసరమైన ఈవేళలో దూరంగా ఉంటూ ‘ప్రత్యర్ది పార్టీ’ కి మద్దతుగా ట్వీట్స్ చేయడం సబబుకాదనే చెప్పాలి. మొన్న బిజెపిలో చేరిన టిఆర్ఎస్‌ నేత స్వామిగౌడ్, అప్పుడే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ విజయశాంతి మాత్రం కాంగ్రెస్‌ను వీడకుండా బిజెపిలో చేరకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎంతో ధైర్యవంతురాలిగా పేరున్న ఆమెకు ఇది తగదనే చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరాలనుకొంటే ధైర్యంగా ఆమాట చెప్పేసి బిజెపిలో చేరిపోతే కనీసం ఆ పార్టీకైనా ఇటువంటి సమయంలో ఆమె సేవలు ఎంతగానో ఉపయోగపడేవి కదా? 


Related Post