ఈనెల 28న ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన

November 26, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28న హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు సాయంత్రం 4.10 గంటలకు ప్రత్యేకవిమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా భారత్‌ బయోటెక్ కంపెనీకి చేరుకొని అక్కడ  కోవాక్సిన్ పేరుతో తయారవుతున్న కరోనా వాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. ఆ తరువాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా హకీంపేట చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారు. 

కానీ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను పరిశీలించేందుకు ఏముంటుంది? ఒకవేళ ఆ వ్యాక్సిన్‌ను ప్రయోగాలు విజయవంతమైతే దాని ఉత్పత్తికి, పంపిణీకి కేంద్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కదా? ఈ విషయం మొట్టమొదట ప్రధాని నరేంద్రమోడీకే తెలుస్తుంది కదా? మరెందుకు వస్తున్నారు? కోవాక్సిన్ ప్రయోగం విజయవంతమైనందునే కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్రాలన్నీ సిద్దంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు ఇటీవల సూచించారా? 28న హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘కోవాక్సిన్’ తుది ఫలితం, పంపిణీ గురించి ఏమైనా ప్రకటన చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

సరిగ్గా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొన్నప్పుడు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ వస్తుండటం కూడా ఆలోచింపజేస్తోంది. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బిజెపి చాలా సీరియస్‌గా తీసుకొని పోరాడుతోంది కనుక ప్రధాని నరేంద్రమోడీ తన పర్యటనలో ఎన్నికల అంశం గురించి మాట్లాడనున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలవేళ ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది.


Related Post