సర్జికల్ స్ట్రైక్‌తో బిజెపి లాభపడుతుందా...బెడిసికొడుతుందా?

November 25, 2020


img

భారత్‌ సైనికులు, భారత్‌ వాయుసేన పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి వస్తే, వారి ధైర్యసాహసాలకు, కేంద్రప్రభుత్వ అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొనందుకు భారతీయులు అందరూ చాలా గర్వపడ్డారు. అవి శతృదేశంపై చేసిన దాడులు కనుక అందరూ సంతోషించారు కానీ ‘జీహెచ్‌ఎంసీలో బిజెపి అధికారంలోకి వస్తే పాతబస్తీపైనే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని’ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైన కొత్తలో అభివృద్ధి ప్రధాన అంశంగా టిఆర్ఎస్‌ ప్రచారం చేసుకొంటే, హామీల అమలులో...వరదబాధితులను ఆదుకోవడంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానఅస్త్రాలుగా చేసుకొని బిజెపి పోరాడింది. కానీ ఈ అంశాలపై పోరాడితే టిఆర్ఎస్‌దే పైచేయి అవుతుందని బిజెపి భావించిందో ఏమో తెలీదు కానీ వెంటనే వ్యూహం మార్చి, టిఆర్ఎస్‌-మజ్లీస్ అనైతిక బందం, పాతబస్తీలో అక్రమంగా స్థిరపడిన పాకిస్తానీలు, రోహింగ్యా ముస్లింల గురించి గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టింది. 

ఆ క్రమంలోనే బండి సంజయ్‌ పాతబస్తీలో మజ్లీస్ మద్దతుతో స్థిరపడినవారందరిపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి దేశం నుంచి తరిమేస్తామని ఘాటుగా హెచ్చరించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి పాతబస్తీలో స్థిరపడినవారిని తిరిగి పంపించేస్తామని చెప్పడమే బండి సంజయ్ ఉద్దేశ్యమని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది. కానీ ఆయన దానినే కాస్త నాటకీయంగా ‘సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఏరిపారేస్తామని’ చెప్పడంతో టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు బండి సంజయ్ చెప్పిన దాంట్లో “పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్” అనే ఒక్క మాటను మాత్రమే తీసుకొని దానినే తిరిగి బిజెపిపై అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. డి సంజయ్ ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నారనేదానిని పక్కన పెడితే ‘బిజెపిని గెలిపిస్తే పాతబస్తీపై దాడులు చేసి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో చిచ్చుపెడుతుందని’ వాదించేందుకు టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలకు గొప్ప అవకాశం కల్పించినట్లయింది. కనుక ఇప్పుడు ఆ రెండు పార్టీలు తిరిగి బిజెపిపైనే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. 

“పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్” అనే ప్రయోగం బెడిసికొట్టడంతో దాని తీవ్రతను తగ్గించేందుకు ‘సిఎం కేసీఆర్‌ అవినీతి పాలనపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం...అంటూ ఆ జాబితాలో మరికొన్నిటిని చేర్చి బండి సంజయ్‌ సవరణ ట్వీట్లు చేశారు. కానీ ఈ సవరణ ట్వీట్స్ తో టిఆర్ఎస్‌, మజ్లీస్‌ ఎదురుదాడిని అడ్డుకోవడం కష్టమే. కనుక బిజెపి తన వాదనలను బలపరుచుకొనేందుకుగాను ఈ అంశంపై మరింతలోతుకు వెళ్ళి ఎదురుదాడి చేస్తోందిప్పుడు. 

టిఆర్ఎస్‌-మజ్లీస్ పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు హైదరాబాద్‌లో వేలాదిమంది అక్రమవలసదారులకు ఆశ్రయం కల్పించి వారిని ఓటర్ల జాబితాలో చేర్చుతున్నాయని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. వారివలన హైదరాబాద్‌లోని ముస్లిం పౌరులతో సహా అందరూ నష్టపోతున్నారని, మన పౌరులకు దక్కవలసిన సంక్షేమ పధకాలలో రోహింగ్యాలకు, పాకిస్తానీలకు కూడా భాగం పంచవలసి వస్తోందంటూ తమ వాదనలను బలపరుచుకొంటున్నారు. కనుక సున్నితమైన ఈ అంశంపై బిజెపి, టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీల వ్యూహాలలో ఏది ఫలిస్తుందో చూడాలి.


Related Post