జీహెచ్‌ఎంసీపై బిజెపి పట్టుసాధించగలిగితే...

November 25, 2020


img

కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలన్నట్లుగా నాలుగు ప్రధానపార్టీలు హోరాహోరీగా పోరాడుకొంటుండం విశేషం. ఇందుకు ప్రధాన కారణం ఈసారి రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసురుతుండటమే. 

దుబ్బాకలో గెలుపుతో సమరోత్సాహంతో ఉన్న రాష్ట్ర బిజెపి నేతలు అదే స్పూర్తితో...అదే ఊపులో ఈ ఎన్నికలలో కూడా గెలిచి జీహెచ్‌ఎంసీపై పట్టు సాధించాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలందరూ గ్రేటర్ పరిధిలో అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

కర్ణాటక బిజెపి ఎంపీ లాక్యా సూర్యనారాయణ తేజస్వి మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాలన, మంత్రి కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవాడేకర్ వచ్చి వెళ్లారు. మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ నేడు నగరంలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఈనెల 30వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కనుక ఆలోగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా, యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ తదితరులు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు.          

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలదని రాష్ట్ర, కేంద్ర బిజెపి నేతలకు నమ్మకం కలిగింది. ఇప్పటివరకు టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడం అసంభవం అని భావిస్తున్న రాష్ట్ర బిజెపి నేతలకు గట్టిగా కష్టపడితే టిఆర్ఎస్‌ను ఓడించడం సాధ్యమే అనే నమ్మకం దుబ్బాక గెలుపుతో కలిగింది. 

బిజెపి అధిష్టానం కూడా సరిగ్గా ఇటువంటి మార్పు కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది. అందుకే ఈ ఎన్నికలలో గెలుపు కోసం గట్టిగా పోరాడుతున్న రాష్ట్ర బిజెపి నేతలకు పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అందుకే ఈ స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారానికి హేమాహేమీలను పంపిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపి గెలిస్తే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తి అవతరించినట్లే. ఒకవేళ గెలవలేకపోయినా 30-40 స్థానాలు సాధించినా టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసరగలదు. అందుకే టిఆర్ఎస్‌ కూడా బిజెపికి ఇక్కడే అడ్డుకట్టవేసేందుకు గట్టిగా కృషి చేస్తోంది. కనుక తెరాస-బిజీపీల మద్య జరుగుతున్నా ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు? అనే విషయం డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడితే తెలుస్తుంది. 


Related Post